తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచంలోని 63 దేశాల్లో భారత్ నుంచి ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషమని చెప్పారు. ఈ ఘనత అంత ఆషామాషీగా ఏమీ రాలేదన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో రాష్ట్రంలో పచ్చదనం సుమారు 4 శాతం పెరిగినట్లు వెల్లడయింది. కేంద్ర అటవీ శాఖా మంత్రి కూడా మొక్కలు నాటడం, చెట్లు పెంచడంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు మన ప్రయత్నాలను ప్రశంసించారు. ఇదే స్పూర్తి మరికొంత కాలం సాగాలి. హరిత లక్ష్యం సిద్ధించే వరకూ అందరూ పట్టుబట్టి మొక్కలను నాటాలనీ, శ్రద్ధగా పెంచాలి’ అని విజ్ఞప్తి చేశారు.
‘అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపటానికి అనువైన నగరంగా కూడా హైదరాబాద్‌కు ఎంతో పేరు వచ్చింది. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఇంకా పలు ప్లై ఓవర్లు, స్కై ఓవర్లు నిర్మాణదశలో ఉన్నాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది. అది నగర ప్రజలకు దూరాభారం తగ్గించడమే కాకుండా, సాయంత్రం పూట జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతున్నది’ అని సీఎం అన్నారు.