పిల్లలను ధైర్యంగా బడికి పంపాలి : డీహెచ్‌ శ్రీనివాసరావు

తల్లిదండ్రులు తమ పిల్లలను ధైర్యంగా బడికి పంపాలని వైద్య, ఆరోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది నెలల తర్వాత పాఠశాలలు ప్రారంభమాయ్యయన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాలున్నాయని, తొలి రోజు తక్కువ మంది విద్యార్థులు పాఠశాలలకు వచ్చారన్నారు. కొవిడ్‌, సీజనల్‌ వ్యాధుల లక్షణాలుంటే పిల్లలను బడికి పంపొద్దని కోరారు. 95శాతం మంది పాఠశాల సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు చెప్పారు.

టీకా తీసుకున్న సిబ్బందికే పాఠశాలల్లోకి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. పాఠశాలలో మాస్క్‌, తరచూ శానిటైజర్‌ వాడాలని కోరారు. థర్డ్‌ వేవ్‌పై శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు. కొత్త రకం స్ట్రెయిన్‌ వస్తే తప్పా మూడో వేవ్‌కు అవకాశం లేదన్నారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. కొవిడ్‌తో విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని, పిల్లల్లో విద్యపై ఆసక్తి తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారని, పిల్లల మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు తెరిచినట్లు వెల్లడించారు.

తల్లిదండ్రులు పిల్లలను ధైర్యంగా పిల్లలను స్కూల్స్‌కు పంపాలన్నారు. 1-10 ఏళ్ల లోపు వారిలో కేవలం 3శాతం మాత్రమే కొవిడ్‌ బారినపడ్డారని, 20 ఏళ్లల్లో వారిలో 13శాతం మందికి కొవిడ్‌ సోకిందన్నారు. పిల్లలకు కొవిడ్‌ సోకినా 100 శాతం కోలుకుంటున్నారని వివరించారు. సీరో సర్వే ప్రకారం పెద్దల్లో 63శాతం యాంటీబాడీలున్నాయని తెలిపారు. బోనాలు వంటి వేడుకలు జరిగినా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగులేదని, పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు.

ఈ నెలలో 50లక్షల కొవిడ్‌ టీకాలు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. 12 సంవత్సరాలు నిండిన పిల్లలకు టీకా ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు నిండిన పిల్లల కోసం భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ టీకా రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.