తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పదవీ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర బీసీ క‌మిష‌న్ స‌భ్యులు బుధ‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఖైర‌తాబాద్‌లోని బీసీ క‌మిష‌న్ కార్యాల‌యంలో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో.. క‌మిష‌న్ చైర్మ‌న్ డాక్ట‌ర్ వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు, స‌భ్యులు కిశోర్‌గౌడ్‌, సంప‌త్‌, శుభ‌ప్ర‌ద‌ప‌టేల్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బుర్రా వెంక‌టేశం, రాష్ట్ర ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు వినోద్ కుమార్‌, విద్యుత్ సంస్థ‌ల సీఎండీ ప్ర‌భాక‌ర్‌రావుతో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన క‌మిష‌న్ స‌భ్యుల‌కు మంత్రి క‌మ‌లాక‌ర్‌, వినోద్ కుమార్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు బీసీ కమిషన్ దిగ్విజయంగా పనిచేయాలని మంత్రి క‌మ‌లాక‌ర్ సూచించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీసీ, ఎంబీసీ, సంచార కులాల అంశాలపై, ఆ వర్గాల సమగ్ర వికాసం, అభ్యున్నతికి చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన సూచనలను ఇవ్వాల‌న్నారు.