పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్‌

ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామని తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో గత ఏడాది మే 22న దేశంలోనే తొలిసారిగా రీస్టార్ట్‌ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ఏడాది కూడా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోంది.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంక రవీంద్రనాథ్, ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవింద రెడ్డి, ఏపీఐడీసీ చైర్మన్‌ బండి పుణ్యశీల, ఏపీ మ్యారిటైం బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ సలహాదారులు శ్రీధర్‌ లంక, రాజీవ్‌ కృష్ణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.