పర్యావరణ హితంగా గ‌ణేష్ ఉత్సవాలు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

వినాయక నవరాత్రులను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, మ‌ట్టి విగ్రహాల‌ను ప్రతిష్టించి పూజ‌లు చేయాల‌ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శ‌నివారం నిర్మల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్‌ పారీస్‌తో వాతావరణ కాలుష్యం, నీటికాలుష్య సమస్యలు తలెత్తుతాయని, పర్యావరణపై అవగాహన పెంచేందుకే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌లి ఆధ్వర్యంలో పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాల‌ను త‌యారు చేసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతితో సహజీవనం చేస్తూ ముందుకు సాగితేనే మానవ మనుగడకు సార్థకత ఉంటుందని, అందుకే మ‌ట్టి గ‌ణ‌పతుల‌నే ప్రతిష్టించాల‌ని కోరారు.

కాలుష్య నియంత్రణ మండ‌లి ఆధ్వర్యంలో నిర్మల్ నియోజకవర్గంలో 12 వేల మట్టి విగ్రహలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. నిర్మల్ పట్టణంలో మూడు వేల విగ్రహాలను, మండ‌ల కేంద్రాలు, గ్రామాల్లో తొమ్మిది వేల విగ్రహాల‌ను పంపిణీ చేస్తార‌ని వెల్లడించారు. ప్రశాంత వాతావ‌ర‌ణంలో వినాయ‌క ఉత్సవాల‌ను జ‌రుపుకోవాల‌ని కోరారు.