ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు. చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్‌ లక్ష్యమని సజ్జల అన్నారు.