అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యం : మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌

అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని మెదక్‌ జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. తూప్రాన్‌ మండలం దాతర్‌పల్లిలో పదెకరాల్లో ఏర్పాటు చేస్తున్న బృహత్‌ పల్లె ప్రకృతివనం, పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం ఆమె పరిశీలించి మొక్కలను నాటారు. అంతకుముందు ఇస్లాంపూర్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం ద్వారా ప్రతిఏటా కోట్లాది మొక్కలను నాటడం జరుగుతున్నదన్నారు.

పల్లెల్లో పచ్చదనాన్ని నింపేందుకు ఇంటింటికీ ఐదు మొక్కలను నాటడంతో పాటు గ్రామస్తులకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు వివిధ జాతుల మొక్కలతో పల్లె ప్రకృతి వనాలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయించారన్నారు. అదే విధంగా జంగల్‌ బచావో… జంగల్‌ బడావో నినాదంతో పదెకరాల ప్రభుత్వ భూమిలో పండ్లు, పూలు, ఔషధ మొక్కలను నాటేందుకు బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను సైతం ఏర్పాటు చేయిస్తున్నారన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ తీసుకోవాలని ఆమె సూచించారు.- Advertisement –

అనంతరం ఇస్లాంపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ను సదర్శించిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో వరలక్ష్మి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ఎంపీపీ గడ్డి స్వప్నావెంకట్‌, ఎంపీడీవో అరుంధతి, సర్పంచ్‌ సుకన్య, నాయకులు అల్లాపూర్‌ నాగరాజు, సురేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్‌, నాగేశ్‌, నర్సింలు పాల్గొన్నారు.