ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్దన్‌

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి రెండో చైర్మన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, బాజిరెడ్డి గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, గణేశ్‌ గుప్తా తదితరులు హాజరయ్యారు.

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను సీఎం కేసీఆర్‌ ఈనెల 16న నియమించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నారు. గోవర్దన్‌ స్వస్థలం సిరికొండ మండలం రావుట్ల. పోలీస్‌ పటేల్‌ నుంచి ఆర్టీసీ చైర్మన్‌ స్థాయికి ఎదిగారు.

మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిరికొండ ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1999లో ఆర్మూర్‌, 2004లో బాన్సువాడ, 2014, 18లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.