బెయిల్ ఇచ్చేందుకు రూ.25 వేలు డిమాండ్ చేసిన ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో మంగళవారం బాధిత వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్ యాదయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాలరాజుతో పాటు ఐదుగురు అన్నదమ్ములకు సంబంధించిన భూ వివాదంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో 41/ఎ సీఆర్పీసీ కింద స్టేషన్లో బెయిల్ ఇవ్వడానికి ఎస్సై శ్రీనివా్‌సరెడ్డి బాధితుడి నుంచి రూ.25 వేలు డిమాండ్ చేశారు. ఎస్సైకి రూ.20 వేలు, కానిస్టేబుల్ యాదయ్యకు రూ.5 వేలు ఇవ్వాలని తెలిపారు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు బాలరాజు కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. ఎస్సైని ఏసీబీ అధికారులు విచారించి కేసులు నమోదు చేశారు.