తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతం : యూడీఏఐడీ బృందం

తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉందని యునైటెడ్‌ స్టేట్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూడీఏఐడీ) బృందం ప్రశంసించింది. జిల్లాలోని నర్సాపూర్‌లోని అర్బన్‌ పార్కు, హవేళీఘనపూర్‌ మండల పరిధిలోని పోచారం అభయారణ్యం, వనవిజ్ఞాన కేంద్రాన్ని సోమవారం నలుగురు సభ్యులతో కూడిన యునైటెడ్‌ స్టేట్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూడీఏఐడీ) బృందం సందర్శంచింది.

ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, మొక్కల పెంపకం, హరితహారం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి స్థానిక అధికారులను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు.
నర్సాపూర్‌ అర్బన్‌ పార్కులో పెరిగిన మొక్కలను చూసి బృందం ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. అర్బన్‌ పార్కు అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. తెలంగాణకు హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధ్దరణ పనులను తెలంగాణ ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్‌ జైశ్వాల్‌ , సీసీఎఫ్‌ శర్వానన్‌ ఫొటో స్టాల్‌ ద్వారా బృందానికి వివరించారు.

అనంతరం వాచ్‌టవర్‌ పైనుంచి ఫారెస్ట్‌ అందాలను చూసి మైమరచిపోయారు. అర్బన్‌ పార్కులో పండిన సీతాఫలాలను రుచిచూసి బాగున్నాయన్నారు. పోచారం అభయారణ్యం, వనవిజ్ఞాన కేంద్రం నిర్వహణ బాగుందని బృందం సభ్యులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో యూడీఏఐడీ డిఫ్యూటీ అసిస్టెంట్‌ అంజలీ కౌర్‌, మిషన్‌ డైరెక్టర్‌ ఇండియా వీణారెడ్డి, సీనియర్‌ ఫారెస్ట్‌ అడ్వైజర్‌ వర్గీస్‌ పాల్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ అలైన్‌ లీ ఉన్నారు. వారి వెంట సీసీఎఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ లోకేశ్‌ జైశ్వాల్‌, సీసీఎఫ్‌ శర్వానన్‌, డీఎఫ్‌వోలు రవి ప్రసాద్‌, జ్ఞానేశ్వర్‌, ఎఫ్‌ఆర్‌వోలు అంబర్‌సింగ్‌, మనోజ్‌కుమార్‌, ఫారెస్ట్‌ ఫ్లస్‌ 2.0 టీమ్‌ సభ్యులు మనోజ్‌ పట్నాయక్‌, సాయిలు, డిప్యూటీ రేంజర్‌ మనోజ్‌కుమార్‌, ఎఫ్‌డీవో ఫ్లయింగ్‌ స్వాడ్‌ జ్ఞానేశ్వర్‌, సిబ్బంది ప్రసాద్‌, తదితరులు ఉన్నారు.