278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం ఎస్‌ఐ రవికుమార్‌, డీటీసీఎస్‌ అధికారి రాజశేఖర్‌ పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు మిల్లులో తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం రాసిగా పోసి ఉన్నట్లు గుర్తించామన్నారు. సదరు బియ్యాన్ని బస్తాల్లో నింపి హుజూర్‌నగర్‌ సివిల్‌ సైప్లె అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. మిల్లు యజమానిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారి వెంట ట్రైనీ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

రేషన్‌ బియ్యం విక్రయిస్తున్న పలువురి అరెస్ట్‌ : ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

మఠంపల్లి మండల పరిధిలోని అల్లీపురం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన లక్ష్మీనారాయణ, రాధిక రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి, వాటిని తమ మిల్లులో డ్రైవర్‌ భూక్యా బాలు సాయంతో పాలిష్‌ చేసి అధిక రేటుకు విక్రయిస్తున్నారని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. మంగళవారం హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. గుండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఇతర వ్యక్తుల నుంచి 278 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సేకరించి వాటిని మిల్లర్లకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. సదరు బియ్యాన్ని మఠంపల్లి పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ వెంకటరెడ్డి ఉన్నారు.