కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి

కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌ కుమార్‌ కన్నుమూశారు. కర్ణాటకలో సూపర్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ హీరో శుక్రవారం ఉదయం జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. దీంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆసుపత్రి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. కానీ ఆ ప్రార్థనలేవీ నెరవేరలేదు.

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఉదయమే ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు.. ఆయన మరణించినట్లు తాజాగా ప్రకటించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఆసుపత్రికి వచ్చి పునీత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన మరణవార్తను ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. పునీత్‌ రాజ్ కుమార్‌ మరణం నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా హైఅలర్ట్ విధించారు. సినిమా హాళ్లు ఏవీ తెరవొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ త‌న టాలెంట్‌తో ప‌వ‌ర్ స్టార్ అని పిలిపించుకుంటున్నాడు. పునీత్ మంచి డ్యాన్స‌ర్ కూడా కావ‌డంతో ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

పునీత్ రాజ్ కుమార్ జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలారు. దీంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేకపోయింది. 46 ఏళ్ల కన్నడ పవర్‌ స్టార్‌ గుండెపోటుతో కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.