నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. మనం భావితరాలకు అందించే గొప్పసంపద ఇదేనని, దనిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.
గత ఏడేళ్లలో 20 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ ముందుచూపుతో హరితహారం పథకం ద్వారా 24 శాతానికి పెంచుకున్నామన్నారు. 4 శాతం అటవీప్రాంతం పెంచుకోవడం గొప్ప విషయం మన్నారు. మానవ నిర్మిత అటవీ ప్రాంతాన్ని పెంచుతున్న రాష్ట్రంగా తెలంగాణకు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయని గుర్తు చేశారు.- Advertisement –
అలాగే పోడు సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. భవిష్యత్ లో అటవీ భూముల అక్రమణను అడ్డుకుని, అడవులను సంరక్షించుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అటవీ భూములే ఉపాధిగా జీవిస్తున్న ఆదివాసులు, గిరిజనులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించి, పట్టాలు ఇవ్వాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
2005 వరకు అటవీ భూములు సాగు చేస్తున్న వారికి హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75 ఏళ్లుగా అటవీ భూమిని అనుభవిస్తున్న గిరిజనేతరులకు హక్కులు కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించిందన్నారు. హక్కులు కల్పించే విషయంలో వంద శాతం ప్రామాణికత పాటించాలన్నారు.
అటవీ సంరక్షణ, అటవీ భూములపై డివిజన్, సబ్ డివిజన్, గ్రామస్థాయిలో మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేసి అర్హులకు భూముల పట్టాలు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఎవరు ఎంత మేర ఆక్రమణలో ఉన్నారన్నది రికార్డ్ చేయడం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా భూ విస్తీర్ణం 16 లక్షల 17 వేల 305 ఎకరాలు.
జిల్లాలో అటవీ విస్తీర్ణం 5 లక్షల 96 వేల 898 ఎకరాలు. (36.90%) జిల్లాలోని 12 మండలాలలోని 36 రెవెన్యూ గ్రామాల పరిధిలో 7449.68 ఎకరాల అటవీ భూమి (1.25%) 2302 మంది ఆక్రమణలో ఉందని వివరాలను వెల్లడించారు. 2005 ముందు వరకు 1018 మంది చేతులలో 3374 ఎకరాలు, 2005 తర్వాత 1284 మంది చేతులలో 4075.68 ఎకరాలు ఆక్రమణలో ఉంది.
అర్హులైన అందరికీ పోడు భూముల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. సమస్యలు పరిష్కరించి, పోడు భూముల క్రమబద్ధీకరణకు అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పద్మావతి, కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్లు మనూచౌదరి, శ్రీనివాస్ రెడ్డి, డీఎఫ్ఓ కిష్డగౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.