రేపు ఉ. 8 గంట‌ల‌కు హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల‌లో ఈవీఎంల‌ను భ‌ద్ర‌ప‌రిచారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు ప‌రిస‌రాల్లో 144 సెక్ష‌న్ విధించారు.

ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్‌ ఏర్పాటుచేశామని, 22 రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభ‌మైన వెంట‌నే పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. అనంత‌రం ఈవీఎంల‌ను లెక్కించ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో శనివారం జరిగిన పోలింగ్‌లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. దాంతో రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓట్లు 2,36,873 కాగా, ఓటు హ‌క్కు వినియోగించుకున్న వారి సంఖ్య 2,05,236. కాగా 1,02,523(87.05 శాతం) మంది పురుషులు, 1,02,712(86.25 శాతం) మంది మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.