ఇది రైతులు సాధించిన గొప్ప విజ‌యం.. ఇక‌పైనా ఆందోళ‌న కొన‌సాగుతుంది : బీకేయూ నేత‌ రాకేష్ తికాయిత్‌

వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌క‌ట‌న చేయ‌డంపై భార‌తీయ కిసాన్ యూనియ‌న్ (బీకేయూ) నేత‌ రాకేష్ తికాయిత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది రైతులు సాధించిన గొప్ప విజ‌య‌మ‌ని చెప్పారు. అయితే, ఇప్పుడ‌ప్పుడే తాము ఆందోళ‌న విర‌మించ‌బోమ‌ని, పార్ల‌మెంటులో వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ర‌ద్ద‌య్యే వ‌ర‌కు త‌మ ఆందోళ‌న కొన‌సాగుతుంద‌న్నారు. అదేవిధంగా క‌నీస మ‌ద్దతు ధ‌ర‌కు హామీ ఇస్తూ కేంద్రం చ‌ట్టం చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ విజ‌యం వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతుల‌కు, అదేవిధంగా త‌మ‌తోపాటు ఆందోళ‌న‌లో పాలుపంచుకున్న‌ గిరిజ‌నుల‌కు, కూలీల‌కు, మ‌హిళ‌ల‌కు అంకిత‌మ‌ని రాకేష్ తికాయిత్ వ్యాఖ్యానించారు. అయితే, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం ఎన్నిక‌ల గిమ్మిక్కులా క‌నిపిస్తున్న‌ద‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ మ‌ధ్య దేశంలో మోదీ ప్ర‌భుత్వ గ్రాఫ్ ప‌డిపోవ‌డం మొద‌లైంద‌ని, ఇమేజ్ దెబ్బ‌తింటున్న‌దని అన్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్ల‌లో.. కేవ‌లం వాళ్ల‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరేలా ప‌నిచేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.