జమున హేచరీస్‌ వ్యర్థాల పారబోతపై అధికారుల పరిశీలన

మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని జమున హేచరీస్‌ పరిశ్రమ వ్యర్థాలపై ఆదివారం పంచాయతీరాజ్‌ అధికారులు విచారణ చేపట్టారు. తూప్రాన్‌ డీఎల్‌పీవో వరలక్ష్మి, గతంలో ఎంపీవోగా విధులు నిర్వహించిన తిరుపతిరెడ్డి, ప్రస్తుత ఇంచార్జ్‌ ఎంపీవో నాగభూషణంలతో కలిసి జమున హేచరీస్‌ వదులుతున్న కోళ్ల వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు పారబోసే స్థలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా డీఎల్‌పీవో వరలక్ష్మి మాట్లాడుతూ.. జమున హేచరీస్‌ పరిశ్రమ వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన వస్తుందని, దీంతో రాత్రి వేళల్లో పడుకోలేకపోతున్నామని, అలాగే పక్కనే ఉన్న ఎక్కచెరువు కలుషితం అవుతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్‌ విచారణ చేపట్టాలని ఆదేశించారన్నారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు తాము విచారణ చేస్తున్నామని, ఇప్పటికే పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు అధికారులు నమూనాలను సేకరించారన్నారు. ప్రజాఆరోగ్యం బాధ్యత పంచాయతీరాజ్‌పై ఉన్నందున తాము సైతం వ్యర్థాల పారబోత, గాలి, నీరు కలుషితంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. వీరివెంట అచ్చంపేట, హకీంపేట గ్రామాల కార్యదర్శులు ఉన్నారు.