లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో మంగళవారం ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. కరోనా సమయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్ రజనీకాంత్ శానిటేషన్ పనులు చేశారు. ఇందుకు గాను అతనికి రెండు బిల్లులు రూ. 9,28,796లు రావాల్సి ఉన్నది. కాగా పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్ గత నాలుగు నెలలుగా రామగుండం కార్పొరేషన్‌కు ఇంచార్జి కమిషనర్ కొనసాగుతున్నారు. బిల్లుల చెల్లింపు కోసం కాం ట్రాక్టర్ పలుమార్లు ఇంచార్జి కమిషనర్‌ను కలిశారు.
రూ.లక్ష లంచం ఇస్తేనే బిల్లులు చేయిస్తానని చెప్పడంతో రజనీకాంత్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి ఆర్డీవో క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆర్డీవో తన ఇంట్లో పనిచేసే హనుమకొండకు చెందిన తోట మల్లికార్జున్‌కు ఇవ్వాలని సూచించడంతో అతనికి రూ.లక్ష ఇచ్చారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడి చేసి డబ్బులను రికవరీ చేసుకొన్నారు. ఆర్డీవో శంకర్కుమార్తోపాటు ఆయన సహాయకుడు తోట మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకొన్నారు. వీరిని బుధవారం కరీంనగర్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.