ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని స్టార్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అమీర్‌పేటలోని నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య.. 1933, జూలై 4న గుంటూరు జిల్లాలోని వేమూరులో జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడైన ఆయన నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన రోశయ్య.. 1968లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు. 1968, 74, 80లో వరుసగా మండలికి ప్రాతినిథ్యం వహించారు.

1979లో అంజయ్య ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రిగా బాధ్యలు చేపట్టారు. 1982లో కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రిగా సేవలు అందించారు. 1992లో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలు చేపట్టారు. 1998లో నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004, 2009లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సర్కార్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యలు నిర్వహించారు.

ఉమ్మడి ఏపీలో పలు కీలక శాఖలు నిర్వహించిన ఆయన సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పనిచేశారు. మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2009లో సీఎం రాజశేఖర్‌ రెడ్డి హఠాన్మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009 సెప్టెంబర్‌ 3 నుంచి 2011 జూన్‌ 25 వరకు సీఎంగా పనిచేశారు. అనంతరం ఐదేండ్లపాటు తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు 31వ గవర్నర్‌గా బాధ్యలు చేపట్టిన రోశయ్య.. 2016, ఆగస్టు 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. వయోభారంతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.