భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ అరెస్ట్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో వనమా రాఘవను కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఘవను తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌లో గురువారం ఉదయం రాఘవ మీడియా సమావేశం పెట్టాలనుకున్నాడు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఎమ్మెల్యేతో టచ్‌లో ఉన్న పోలీసులు.. మీడియా ముందుకు రాకుండానే రాఘవను అరెస్ట్‌ చేశారు. వనమా రాఘవపై 302, 306,307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  రాఘవకు బెయిల్‌ రాకుండా కౌంటర్‌ ఫైల్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. 

కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య విషయంలో రాఘవపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.