ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు రాష్ట్రంలో అమలు కావడం లేదని.. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే (సింగిల్ యూజ్) ఫ్లెక్సీలు, పీవీసీ, ఇతర ప్లాసిక్ వస్తువుల వినియోగంపై నియంత్రణ లేకుండాపోయిందని పేర్కొంటూ ఖమ్మంకు చెందిన బి.ఓంకార్, హైదరాబాద్‌కు చెందిన కె.ఎన్.సాయికుమార్ వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి ఽధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ ప్రకారం రాష్ట్రస్థాయిలో కమిటీని నియమించాల్సి ఉందని తెలిపారు. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఽకోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. రాష్ట్ర మున్సిపల్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ అమలుపై కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదావేసింది.