ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(49) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో నిన్న హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరిన గౌతమ్ రెడ్డి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనకు నిన్న గుండెపోటు రావడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు.
గౌతమ్ రెడ్డి మృతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. నెల్లూరు జిల్లాలో ఆయన పారిశ్రామికవేత్త, రాజకీయవేత్తగా ఎదిగారు. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడే గౌతమ్ రెడ్డి.