ఫార్మా కాలుష్యకోరల్లో మూడుగ్రామాలు

కంపెనీ వస్తుందంటే కొలువు దొరుకుతుందనుకున్నారు. కానీ.. తమ పొలాల్లోకి విషపు నీళ్లొచ్చేదాక తెలియదు భూములిచ్చింది. తమ ప్రాణాలు తీసే ఫార్మాకంపెనీలకని. రెండు దశాబ్దాల్లో ఒక్కటి పోయి నాలుగయ్యాయి. పశుపక్షాదుల ప్రాణాలు పోయాయి. ఊపిరితిత్తులు, చర్మ, క్యాన్సర్‌ వ్యాధులతో ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. అయినా ఆ ఫార్మా దాహం తీరడం లేదు. 50 రెట్లకు పైగా విస్తరణకు సిద్ధమవుతున్నది. ఒక గ్రామంలో ఒక్కటిగా మొదలైన ఫార్మా ప్రస్థానం.. ఇప్పుడు సామ్రాజ్యంలా మారి రెండు మండలాల ప్రజల మనుగడకే ముప్పుగా పరిణమించింది. అయినా పాలకులకు ఇవేవీ పట్టడం లేదు. జీవన విధ్వంసానికి అభివృద్ధి పేరుపెట్టి ప్రజలను బలి పశువులను చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 2005-06 సంవత్సరంలో ఐకెమ్‌ అనే పరిశ్రమ వచ్చింది. పిట్టంపల్లి వెళ్లేదారిలో భూమి కొనుగోలు చేసింది. పరిశ్రమలొస్తే ఉద్యోగాలొస్తయనుకున్నరు ప్రజలు. అందుకే అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం అంగీకార పత్రం జారీ చేసింది. ప్రభుత్వ అనుమతులు సులభంగానే వచ్చాయి. అది ఫార్మా స్యూటికల్‌ కంపెనీ అని తరువాత తెలిసింది. హెటిరో దాన్ని కొనుగోలు చేసింది. ఒక్కటితో మొదలై ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాన్నే నెలకొల్పింది. ఐకెమ్‌ కాస్తా హిండీస్‌ ల్యాబ్స్‌ అయ్యింది. ఆ తరువాత దశమి ల్యాబ్స్‌ వచ్చింది. తరువాత సైమెడ్‌ ల్యాబ్స్‌ అవతరించింది. ఆశీర్వాద్‌ స్టీల్స్‌, నోష్‌ కంపెనీలూ వీటికి తోడయ్యాయి.
నేల, జల కాలుష్యంతో…
స్థానికులకు ఉద్యోగాలయితే రాలేదు కానీ ఆయా పరిశ్రమల రసాయన వ్యర్థాలతో భూగర్భ జలాల్లోకి కాలుష్యం చేరింది. భూగర్భ జలాల్లో రెసిడ్యుయల్‌ సోడియం కార్బనేట్‌ శాతం 1.25 కంటే ఎక్కువగా ఉంటే అది సాగుకు యోగ్యం కాదు. కానీ రసాయనాల కాలుష్యంతో అది 14.6 శాతానికి చేరింది. దాంతో సాగుకు అనుకూలంగా లేదు. ఎప్పుడో ఎండాకాలంలోనే నీళ్లు కొనుక్కుని తాగేవాళ్లు. ఏడాది పొడుగునా కొనుక్కుని తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కో పరిశ్రమ నీటి వినియోగం ఇరవై మంది రైతుల నీటి వినియోగం కంటే అధికం. దాంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఘన వ్యర్థాలను రాత్రిపూట డ్రమ్ములు, ట్యాంకర్లలో తరలించి మూసీ నదీతీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో డంపింగ్‌ చేస్తున్నారు. ఈ వ్యర్థాలతో భూమి కలుషితమవుతున్నది. ఇక రాత్రయ్యిందంటే చాలు కంపెనీలు వదిలే విషవాయువులతో భరించలేని దుర్గంధం. రాత్రిపూట నిద్రపోలేని పరిస్థితి. ఆశీర్వాద్‌ స్టీల్స్‌ కంపెనీ విషయ వాయువులతో చెట్లు, పంటపొలాలన్నీ పొగబారిపోతున్నాయి. అవి తిని, ఆ నీటిని తాగిన పశువులు, మేకలు, కోళ్లు మృతి చెందాయి. గేదెలు, ఆవుల్లో సంతానోత్పత్తి పోయింది. వాయు కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ, గుండె సంబంధిత, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. బాధితుల ఆందోళనతో కొన్నాళ్లు మూసేసిన యాజమాన్యం ఏడాది కిందట మళ్లీ తెరిచింది. కంపెనీల్లోని భద్రతా లోపాలతో ఉద్యోగుల ప్రాణాలు కూడా బలవుతున్నాయి. రెండేండ్ల కిందట హెటిరో సంస్థకే చెందిన దశమి ల్యాబ్స్‌లో రియాక్టర్‌ పేలింది. ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. ప్రజలు, ప్రజాసంఘాల ఆందోళనల తరువాత రూ.60 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ సగానికే పరిమితమయ్యారు.
చిత్తశుద్ధి లేని నాయకులు..
వెలిమినేడు, బొంగోనిచెరువు, పిట్టంపల్లి గ్రామాల ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారు. వినతిపత్రాలిచ్చారు. చివరకు స్థానిక ఎన్నికల్లో కంపెనీలను రద్దు చేస్తేనే.. మీకు ఓటేస్తాం అని తేల్చి చెప్పారు. పరిష్కరిస్తామని మాటిచ్చారు.. ఇప్పుడు పట్టించుకోవడంలేదు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలెప్పుడూ ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆ ప్రజలు తమవాళ్లు కాదనుకున్న అధికార పక్షాలు అడ్డగోలుగా అనుమతులిచ్చేశాయి. ఇప్పుడు అధికారపక్ష ఎమ్మెల్యేనే అయినా ఏం చేయలేని స్థితి. ఎందుకంటే బడా పరిశ్రమలు చేసే లాబీ అంతా ఇంతా కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం1999 నుంచి అమల్లో ఉన్న ‘బల్క్‌డ్రగ్‌, ఫార్మా కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెంపు, విస్తరణ నిషేధా’నికి నిలువెల్లా తూట్లు పొడిచి… 2013లో తమకు అనుకూలంగా పారిశ్రామిక విస్తరణ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అవి ఈ పెట్టుబడిదారులకు కాసుల పంట పండిస్తున్నాయి. వాతావరణ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఓవైపు పర్యావరణ వేత్తలు డిమాండ్‌ చేస్తుంటే ఆ పర్యా వరణంతో సంబంధం లేకుండా మన పాలకులు పరిశ్ర మలకోసం పెట్టుబడిదారులకు అనుమతులిచ్చేస్తున్నారు.
చట్టాలను ఉల్లంఘించి…
ఈ ఐదు కంపెనీలతోనే ప్రజలు నరకం చూస్తుంటే… వాటి విస్తరణకు అనుమతులిచ్చింది ప్రభుత్వం. గత ఏడాది సెప్టెంబర్‌లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జేసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తాయి. ‘వద్దు బాబోరు’ అని ప్రజలు మొత్తుకున్నా వారి గోడు వినేవారు లేకుండా పోయారు. వీడియో రికార్డింగ్‌ లేదు. ప్రజల వినతిపత్రాలు పట్టలేదు. మొక్కుబడిగా కార్యక్రమం ముగించి అనుమతులిచ్చేశారు. ఇందుకోసం 250 ఎకరాలను కొనుగోలు చేసిన హెటిరో కంపెనీ.. ఇప్పుడున్న దానికి 40 రెట్లు ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇదే జరిగితే.. రానున్న రోజుల్లో చిట్యాల, మునుగోడు మండలాలు కాలుష్య వర్థాల పెంటకుప్పలయ్యే అవకాశం ఉంది.
జీవితాలను బలితీసుకుంటూ…
ఎక్కువ భూములున్నవాళ్లు అమ్ముకుని పట్టణాలకు పయనమవుతున్నారు. భూమి వదల్లేని వాళ్లు… అయినకాడికి సాగు చేసుకుంటూ బతుకులీడుస్తున్నారు. భూమిలేని కూలీలు ఉపాధికోసం వలస వెళ్తున్నారు. ప్రజల జీవితాలను బలి తీసుకుంటూ… బదులుగా సామాజిక బాధ్యత కింద ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు, ఆటవస్తువులు భిక్షగా వేస్తున్నాయి కార్పొరేట్‌ కంపెనీలు. వాళ్ల నోటికాడి బుక్కను, నీటి చుక్కలను లాక్కుంటూ.. వాటర్‌ఫిల్టర్లు, వినాయక మండపాలు కట్టిస్తున్నాయి. ప్రకృతిని విధ్వంసం చేస్తూ… హరితహారం మొక్కలకు ఫెన్సింగ్‌ వేయిస్తూ ఉదారతను చాటుకుంటున్నాయి.
ప్రజా ఉద్యమాలతోనే అడ్డుకోగలం…
అన్ని దేశాల్లో ఎన్విరాన్‌మెంట్‌ అథారిటీలున్నాయి. మన దేశంలో రాజకీయపార్టీలు కుమ్మక్కయి ఏర్పాటు కాకుండా చూశాయి. చట్టాలున్నాయి. అమలు చేయాల్సిన వ్యవస్థలున్నాయి. అలాంటి ప్రభుత్వ చర్యల వల్లే నష్టం జరుగుతుంటే ప్రజలెవరికి చెప్పుకోవాలి? ప్రజా ఉద్యమాలతోనే వీటిని అడ్డుకోగలం.- ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ
కంపెనీలు మూసేయాలి..
1976ల కొనుకున్న నేను భూమి. అప్పటినుంచి సాగు చేసుకుంటున్న. మా పొలం పక్కనే హిండీస్‌ కంపెనీ వచ్చింది. నీళ్లన్నీ కలుషితమయినయి. వ్యవసాయానికి పనికిరాకుంటయినయి. ఒకటి పోయిందని ఇంకోటి.. మూడు బోర్లేసిన. అన్నీట్ల అవే నీళ్లు. మా బతుకులు ఆగం చేసిన ఈ కంపెనీలు మూసేయాలి.- శేపూరి రామచంద్రం, వెలిమినేడు రైతు
నీళ్లు నోట్ల పొయ్యొస్తలేదు…
అంతకుముందు చెలకల్ల ఎక్కడ పోయినా నీళ్లు తాగేది. ఇప్పుడయ్యి నోట్ల పోస్తట్టే లేదు. కానీ ఇప్పుడు ఇంటికొస్తెనే నీళ్లు. కండ్లు కనబడుతలేవు. ఆ నీళ్లతోటి కాళ్లు, కీళ్లనొప్పులొస్తున్నయి. 50 , 60 ఏండ్లకే మనిషి వందేండ్లకు అయితుండు. ఏమన్నంటే సర్కారే లైసెన్సిచ్చిందంటున్నరు. కానీ కేసీఆర్‌ ఇక్కడనే పెట్టిస్తున్నడు ఎందుకో?- వెలిమినేటి రామకృష్ణారెడ్డి, బొంగోనిచెరువు
ఊరు నాశనం చేస్తందుకే…
ఎనిమిది ఎకరాలు భూమి ఉంది. ఫ్యాక్టరీలు వచ్చినంక నీళ్లు తగ్గినయి. వచ్చిన నీళ్లు పొప్పడిపండ్ల వాసనొస్తున్నయి. తిండి మటుకు వరి పంట వేసుకుంటున్నం. ఆ నీళ్లు తాగుతనే లేం. ఆ నీళ్లుశరీరానికి తాకితే దురదొస్తుంది. పొద్దుగాల పొగ, రాత్రి వాసన.. భరించలేకున్నం. అప్పటి లీడర్లు పైసలు తిని బాగుపడ్డరు. ఊరు నాశనం చేస్తందుకే కంపెనీ పెట్టిండ్రు.- జక్కల లక్ష్మయ్య, పిట్టంపల్లి రైతు
(సోర్స్ : కట్ట కవిత, నవతెలంగాణ)