తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 నుంచి జరుగనున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం 7వ తేదీ (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు విడివిడిగా సమావేశమవుతాయి. అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై 7న బీఏసీలో నిర్ణయిస్తారు. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6 సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా, శాసనసభ, శాసనమండలి సమావేశాల ప్రారంభ తేదీని, సమయాన్ని తెలియజేస్తూ అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సోమవారం బులెటిన్‌ను విడుదల చేశారు.
