సూర్యాపేట రూరల్ ఎస్సై లవకుమార్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. సూర్యాపేట మండలంలోని రాజుగారి తోట హోటల్ జీఎం భాస్కరన్‌ను రూరల్ ఎస్సై లవకుమార్ కొన్ని రోజులుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. హోటల్ సజావుగా సాగాలంటే రూ.1.50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. తన హోటల్‌కు అన్ని అనుమతులు ఉన్నా ఎస్సై వేధింపులకు విసిగిపోయిన భాస్కరన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రూ.1.30 లక్షలు తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. లవకుమార్‌ను ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామని మహబూబ్‌నగర్ రేంజ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ బండారి శ్రీకృష్ణాగౌడ్ తెలిపారు.
రిలీవ్ కావాల్సిన సమయంలో ఏసీబీకి చిక్కి..
ఎస్సై లవకుమార్ బుధవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు అందుకొన్నారు. శుక్రవారం ఆయన రూరల్ ఎస్సైగా రిలీవ్ అయ్యి జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉన్నది. కాగా గురువారం మధ్యాహ్నమే అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.