గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాల్యానాయక్‌ రెండేండ్లపాటు జీసీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం నేలబండతండా (వాల్యానాయక్‌తండా)కు చెందిన వాల్యానాయక్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భవం నుంచి వాల్యా క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నారు. నేలబండతండా సర్పంచ్‌గా ఉన్న సమయంలో 2001లో ఆయన కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 నుంచి ఐదేండ్లపాటు బాలానగర్‌ మండల పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ జాగరణ సేన మహబూబ్‌నగర్‌ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. కేసీఆర్‌ చేపట్టిన అనేక ఉద్యమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గిరిజనుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో 2008లో కేసీఆర్‌ తండానిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సమయంలో కేసీఆర్‌ నేలబండ తండాలోని వాల్యానాయక్‌ ఇంట్లోనే బసచేశారు.