తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ (ఉప ఎన్నిక)కు గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. సుమారు రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ను కేసీఆర్ ఎంపిక చేశారు.
ఇక వచ్చే నెల 21న ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల స్థానంలో టీన్యూస్, నమస్తే తెలంగాణ దిన పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఫార్మా సంస్థ అధినేత బండి పార్థసారథిరెడ్డిల పేర్లను ఖరారు చేశారు. వారు ఆరేళ్లపాటు పదవిలో ఉంటారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి పార్టీ బీఫారాలు అందజేసి అభినందించారు. రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ వేయనున్నారు.