“మంచి పనులు చేస్తే సాటి మనుషులే కాదు ప్రకృతి కూడా సహకరించి దీవిస్తుంది. మంచి పనులు చేసిన వారికి మంచి ఆరోగ్యంతో పాటు జీవన జీవిత కాలం కూడా పెరుగుతుంది. మంచి ఉద్దేశ్యాలున్నవారిని లక్ష్యాలు గమ్యం చేరేందుకు చుట్టుతా వున్న సమాజంతో పాటు ప్రకృతి కూడా సదా సహకరిస్తుంది. రోడ్ల వరుసంతా మర్రి వృక్షాలు నాటి పెంచిన కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త తిమ్మక్క చెట్లను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకే జీవితాన్ని అంకితం చేసింది. ఆమె 111 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉందంటే అందుకు కారణం ఆమె మంచి ఉద్దేశ్యం గల లక్ష్యంతో జీవించటమే. మంచి లక్ష్యాలతో జీవించిన వారినే సమాజం, ప్రజలు గుర్తిస్తారు. నిస్వార్ధంగా పని చేయటానికి నిలువెత్తు నిదర్శనం తిమ్మక్క. ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సాక్షిగా 33 జిల్లాల కలెక్టర్లు, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వాహకుల సాక్షిగా ప్రగతి భవన్ లో ప్రముఖ పర్యావరణ వేత్త, కర్ణాటకకు చెందిన 111 సంవత్సరాల సాలుమరద తిమ్మక్కను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘనంగా సన్మానించారు. ప్రకృతి పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించటం ప్రకృతి పరిరక్షకులకు, ప్రేమికులకు ఎంతో సంతోషనిచ్చే అంశమే కాకుండా సమాజానికి కూడా మంచి ప్రేరణగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత 14 శాతం అడవులను పెంచుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో చెట్ల పెంపకాన్ని మహోద్యమంగా చేపట్టటంతో ప్రగతి రథచక్రం వేగంగా ముందుకు సాగుతుంది. నీళ్ళు, కరువులను ఎదుర్కుంటున్న తెలంగాణ పచ్చగా పచ్చబడటం వెనుక ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జరిగిన కృషి మాములుదేమి కాదు. పర్యావరణకు సంబంధించి మన దేశంతో పాటు ప్రపంచం కూడా అనేక సవాళ్లను ఎదుర్కుంటున్న తరుణంలో తెలంగాణ తనను తాను నిలదొక్కుకుంటుంది. ముఖ్యమంత్రి సంకల్పం గొప్పది. ఒక పక్క అడవులను పెంపొందిస్తూ మరో పక్క పల్లె ప్రగతి పేరున ఒక్క సంవత్సర కాలంలో 19,472 పల్లె ప్రకృతి వనాలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేయటం మంచి అభివృద్ది సూచికగా నిలుస్తుంది. మానవ జీవితంలో మొక్కలు నాటటం అతి పెద్ద పని మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న ఆచరణతో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాలకు తోడుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చెపట్టిన మొక్కలు నాటి పెంచే కార్యక్రమం విస్తృతంగా ప్రజల్లోకి పోయింది. మొక్కలు పెంచటంపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరుగుతుంది. ప్రధానంగా ఈ తరం పిల్లల్లో మొక్కల పెంపకంపై స్ఫూర్తిని కలిగించటానికి ఈ కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. పాఠశాలల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల విద్యార్ధుల వరకు చెట్ల పెంపకంలో భాగస్వాములు కావటం మొత్తం విద్యారంగం ఇందులో కార్యశీలురుగా నిలబడటం మంచి స్ఫూర్తినిస్తుంది. ప్రతి ఒక్కరిలో మరింత ప్రోత్సాహం కలిగించేందుకు ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కరణ కోసం జరుగుతున్న కృషిలో భాగంగా సాలుమరద తిమక్కను కేసీఆర్ ఘనంగా సన్మానించారు. ఆమెను సన్మానించటం ద్వారా కొత్త తరంలో వృక్ష సంరక్షణపై దృష్టి పెట్టటమేగాక ఇందుకోసం కృషిచేసిన వారిని అధ్యయనం చేయవలసిన దృష్టి కూడా కలుగుతుంది. తెలంగాణలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలాగే ఎందరెందరో దేశ దేశాల్లో కృషిచేస్తున్నారు. సాలుమరద తిమ్మక్కను సన్మానించుకోవటమంటే మొత్తం వృక్ష పరిరక్షకులను గౌరవించు కోవటమే అవుతుంది. అడవులను పెంచుకుంటే నీటికొరత ఉండదు. వర్షపాతం పెరుగుతుంది. అడవులు వృక్ష సంపద నుంచి దొరకాల్సిన వస్తువులు దొరకకపోతే పల్లెలు పేదరికంలోకి పోతాయి. మొక్కల వల్ల తీర్చుకునే అవసరాలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వాన్నే ఆ పనిలోకి దించటం జరిగింది. పర్యావరణం దెబ్బతింటే ప్రజల జీవన ప్రమాణాల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్న విషయాన్ని గుర్తించే కేసీఆర్ ప్రభుత్వాన్ని హరితహారంగా మార్చారు. సమతుల్యమైన మంచి వాతావరణం కారణంగానే తెలంగాణ పల్లెలు పచ్చపచ్చగా ఉన్నాయి.
కేసీఆర్ మొక్కల ప్రేమికుడిగా సాలుమరద తిమ్మక్కను సన్మానించటంతో పర్యావరణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన కెన్యా దేశానికి చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వంగారి మటా మాధామ్ గడ్డిపరకలతో విప్లవాలు సృష్టించిన జపాన్ రైతు మొక్కల శరీర ధర్మ శాస్త్రాన్ని చదివిన మసనోబు పుతుయోకా, ఉత్తరాఖండ్ కు చెందిన మన దేశంలో పర్యావరణ ఉద్యమాలకు తొలి అడుగువేసిన వ్యక్తిగా చెప్పకునే పర్యావరణవేత్త సుందర్ లాల్ బహుగుణ, చిప్కో ఉద్యమం నవధాన్య ఉద్యమాలను, గంగా పరిరక్షణ ఉద్యమాలను, రాజేంద్ర సింగ్ జోహెడ్ పధకరె, అన్నా హజారే, మన ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మొక్కల సంరక్షణ ఉద్యమకారుడు వనజీవి రామయ్య, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ లను అత్యంత ఘనంగా సన్మానించుకున్నట్లయ్యింది. సాలుమరద తిమ్మక్కను తెలంగాణ ప్రభుత్వం గౌరవంగా సన్మానించటం వల్ల మొక్కలు ఉద్యమకారిణి పెద్దింటి వృక్షమాత, కన్నడ తులసి గౌడను, జమునా తుడును, మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ సక్సేనా, రాజస్థాన్ కు చెందిన శ్యామ్ సుందర్ జయానీలను గుర్తు చేసుకున్నట్లయింది.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి రివ్యూ సమావేశంలో సాలుమరద తిమ్మక్కను గౌరవించుకోవటమంటే ప్రభుత్వం వృక్షసంపద, అడవుల సంరక్షణ, హరితహారం విషయంలో ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేస్తుందో అవగతమవుతుంది. ఇది ఈ తరంకు ఒక మంచి సందేశంగా నిలుస్తుంది. ఈ తరం వారిలో ఒక మంచి కదలిక తీసుకరావటానికి పర్యావరణ పరిరక్షణ వైపు వారు దృష్ఠి సారించటానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది.
తిమ్మక్క మాట మాట్లాడుతున్నంతసేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రద్దతో ఆమె ముందు నిలుచుని విన్నారు. ఆ వయసులో కూడా ఆమెలో వున్న పట్టుదలను మళ్లొక్కసారి ప్రపంచదృష్టికి తీసుకరావటానికే కేసీఆర్ కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని, వాటిని చూస్తున్నాను అని తిమ్మక్క ప్రశంసించింది. హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణకు బాగా మేలు జరుగుతుందని అది జీవన ప్రక్రియకు దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం, రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటటం ద్వారా మనకు వారసత్వంగా వస్తున్న ప్రాంతీయ చెట్లు భవిష్యత్ తరాలకు నీడనిస్తాయి. జనులకు పక్షులకు, జంతువులకు పండ్లనిస్తాయి. ఆకలి తీరుస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షించి సమాజాన్ని కాపాడుతాయని ఆమె ఆశించింది దీవించింది. తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కు అభినందనలు చెప్పింది. కేసీఆర్ పర్యావరణవేత్తకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఆమెను తెలంగాణ సమాజానికి పరిచయం చేశారు. ఆమెను మోడల్ గా తీసుకొని ఈ తరం నుంచి పర్యావరణ పరిరక్షకులు, మొక్కల సంరక్షకులు తయారు కావాలన్న స్ఫూర్తిని కలుగచేసినందులకు అభినందనలు.
– జూలూరు గౌరీశంకర్ (సోర్స్: ఆంధ్ర ప్రభ)