అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు..!

• జీతం కంటే లంచం ద్వారానే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న అవినీతి అధికారులు.
• ఉద్యోగంలో చేరిన నాటి నుండే అవినీతి మొదలు పెడుతున్న ప్రభుత్వ అధికారులు. 
• నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగులు సైతం వీరిని చూసి అవినీతికి, లంచాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే ప్రమాదం ఉంది.
• ప్రభుత్వ కార్యాలయాలలో కనిపించకుండా పోతున్న నిజాయితిపరులైన అధికారులు.

లంచం, లంచం, లంచం! ఇటీవలి కాలంలో తెలంగాణవ్యాప్తంగా ప్రతీ రోజు ఏదో ఒక చోట అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కిన కూడా మిగతా అధికారులకు ఎలాంటి భయం లేకుండా బాహాటంగా లంచాలు తీసుకుంటూ వున్నారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారులు ప్రతీ పనికి ఒక రేటు చొప్పున ధర నిర్ణయించి మరీ అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. తమ బంధువులు, మిత్రులను బినామీలుగా చేసుకొని వారి ద్వారా లంచాలు తీసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ వున్నారు. ప్రభుత్వం నెల నెల టంచన్ గా అందించే వేలాది రూపాయల జీతాలతో ఎంతో హుందాగా మరియు బాధ్యతగా ఉండల్సిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడి తమ దగ్గరకు ఏదేని పని నిమిత్తమై వచ్చిన సామాన్య ప్రజల నుంచి, చిన్న, సన్న కారు రైతుల నుంచి తమకు కావలసినంత సొమ్మును ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ తమ వికృత, నికృష్ట నైజాన్ని చాటుకుంటుండటం తీవ్ర హేయమైన, ఆక్షేపణీయమైన విషయం.

అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల డబ్బు పిచ్చి ఏ విధంగా తయారు అయ్యింది అంటే ‘అయ్య గారికి లంచం ఇస్తేనే ఫైల్ కదులుద్ది. కాస్తో.. కూస్తో.. సామాన్య ప్రజల నుంచి కాసులు గుంజనిదే వారికి ఆ రోజు నిద్రపట్టేలా లేదు అన్నట్లుగా.. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సామాన్య ప్రజలను ఒక జలగ లాగా పీక్కుతింటూ వారి నుంచి బలవంతంగా అయిన కాసులు దండుకుంటుండటం అత్యంత సిగ్గు చేటైనా విషయం. కొన్ని సందర్భాలలో వీరి అవినీతి, లంచాలు శృతి మించి, సామాన్య ప్రజలకు వెర్రెత్తి వీరి బాగోతాన్ని ఏసీబీ అధికారులకు చేరవేస్తే వారు ఆగ మేఘాల మీద వచ్చి వీరి మీద పడి వీరిని అత్యంత అవమానకరంగా సస్పెండ్ చేస్తున్నప్పటికీ.. వీరి వక్ర బుద్ధిలో ఏ మాత్రం మార్పు రాకపోవడం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత బాధాకరమైన విషయం. అంతేకాకుండా వీరిలో మార్పు రాకపోవడం వలన బాధితులు ఏం చేయాలో తోచని సందర్బంలో భాధలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి సంఘటనలు ఎన్నో చూడటం జరుగుతుంది.

ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసిన అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో ధరణి వచ్చినా కూడా అవినీతి మాత్రం తగ్గలేదు. భూ రిజిస్ట్రేషన్ ల కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళిన పేద రైతులను లంచాల కోసం అవినీతి అధికారులు పీడిస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణ మొన్న ఈ మధ్య ఏసీబీ కి పట్టుబడిన తహశీల్దార్ ఇండ్లలో దొరికిన కోట్ల రూపాయల అవినీతి సోమ్మే నిదర్శనం. అంతేకాదు  పర్యావరణాన్ని కాపాడి ప్రజలకు అండగా ఉండాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల అవినీతి గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. పరిశ్రమలు చేస్తున్న పొల్యూషన్ మీద వచ్చిన ఫిర్యాదులను సైతం తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకొని లంచాలను దండుకొంటున్నారు అవినీతి అధికారులు. కొంత మంది అవినీతి అధికారులు పరిశ్రమలలో మనుషులు చనిపోయిన సరే వారి చావులను కూడా లంచాలను తీసుకొని మార్చేస్తున్నారు. ఎన్నో పరిశ్రమలు పొల్యూషన్ విచ్చల విడిగా చేస్తూ ఉంటే బాధితులు టాస్క్ ఫోర్స్ కు ఫిర్యాదు చేస్తే టాస్క్ ఫోర్స్ లోని కొంత మంది అవినీతి అధికారులు వచ్చిన ఫిర్యాదులను తొక్కి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు అని పొల్యూషన్ బాధితులు వాపోతున్నారు. ఇక ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనే లేదు. కాలం చెల్లిన వాహనాలకు అనుమతులు,సరైన పిట్ నెస్ లేని వాహనాలకు అనుమతులు, దొంగ లైసెన్స్ లు (వయసుతో సంబంధం లేకుండా) ఇలా ఎన్నో లంచం ఇస్తే చాలు అక్కడ కాని పని అంటూ ఏదీ ఉండదు అనేది అందరి నోట వినిపిస్తున్న మాటే. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో లంచం ఇస్తే చాలు ఎవరి భూమిని ఎవరి పేరు మీద అయిన చేస్తారు అనేది జగమెరిగిన సత్యమే. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఏదో ఒక వంకపెట్టి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని బెదిరించి మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేయడం వీరికి పరిపాటి. అడవులను కాపాడాల్సిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు కూడా అక్రమ కలప రవాణా, దుంగల తరలింపు, అటవీ భూముల ఆక్రమణ, వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న ఇందులోని అవినీతి ఉన్నతాధికారుల కండ్లకు కనిపించదు. అడవుల అభివృద్ది కోసం మన సీఎం కేసీఆర్ హరితహారం పేరిట అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే అందులో కూడా ఈ అవినీతి అధికారులు తమ చేతివాటం బాగానే చూపిస్తున్నారు అనేది పలువురి నోట వినిపిస్తున్న మాట. ట్రాన్స్ కో డిపార్ట్ మెంట్, వ్యవసాయ శాఖలలో కూడా అవినీతి విపరీతంగా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శాఖలో కొంతమంది అవినీతి అధికారులు అవినీతి సొమ్మును కోట్లలోనే సంపాదిస్తున్నారు.

కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అయితే కొంతమంది అధికారులు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుండే అవినీతి సంపాదనకు అలవాటు పడుతున్నారు. అవినీతి అధికారులు తమ జీతాల కంటే అవినీతి సొమ్ము ద్వారానే ఎన్నో రేట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో పట్టుపడుతున్న అవినీతి అధికారుల సొమ్ము వందల కోట్లలోనే ఉండటం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 

ఏది ఏమైనా వీరికి ఏ మాత్రం పేద ప్రజలపై, సామాన్య రైతులపై జాలి, దయ, సానుభూతి అంటూ ఏ మాత్రం ఏ కోశానా ఉండదు. ఎంతసేపు వీరి జేబులు నింపుకోవడం పైనే వీరి దృష్టి అంతా. ఏమి చేస్తాం వీరికి ఎంత సేపు డబ్బు సంపాదనపై తీరని వ్యామోహం తప్పించి వీరిలో మానవత్వం ఇసుమంతైనను కానరాదు.  ఈ అవినీతి అధికారులను చూసి వీరి యొక్క ఒత్తిడికి తలఒగ్గి కొంతమంది నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగులు సైతం అవినీతికి పాల్పడి లంచాలను బహుమతుల రూపంలో తీసుకోవడం జరుగుతుంది. కావున ఒకరిని చూసి ఒకరు అవినీతికి, లంచాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే ప్రమాదం సైతం పొంచి వుంది. ఇందులో ఎలాంటి సందేహానికి తావులేదు. ఏమైనా కాలమే వీరి దుర్బుద్ధిని, వక్ర స్వభావాన్ని మార్చాలి తప్ప వీరు మారరు గాక మారరు. దురాశపరులు, లంచాలకు రుచి మరిగిన బొత్తిగా వ్యక్తిత్వం లేని ధనాశపరుల నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని రూపుమాపేందుకు మనమంతా ప్రతిన భూనాల్సిన సమయం ఆసన్నమైంది. అవినీతి, లంచం అనే మహమ్మారిని తరిమి తరిమి కొడదాం..! అవినీతి రహిత సమాజ రూపకల్పనకు మన వంతుగా పాటుపడదాం..!
(నోట్: రాబోయే వ్యాసాలలో డిపార్ట్ మెంట్ ల వారీగా అవినీతిలో మునిగితేలుతున్న అధికారుల వివరాలను అందిస్తాం.. మీకు తెలిసిన అత్యంత అవినీతి అధికారుల పేర్లు మాకు తేలియచేయండి.. మీ వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా.. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా టీం దే..)