700 విజిలెన్స్‌ రిపోర్టుల పెండింగ్‌పై సీఎస్ కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ

వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతి, అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం విచారించి రూపొందించే నివేదికలు బుట్టదాఖలవుతున్నాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్ జీజీ) ఆరోపించింది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి ఎనిమిదేళ్లలో 700 వరకు విజిలెన్స్‌ రిపోర్టులు, 1,000 వరకు అలర్ట్‌ నోట్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు లేఖ రాశారు. పురపాలక శాఖలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీకి సంబంధించి కొన్ని విజిలెన్స్‌ రిపోర్టులను పరిశీలించగా.. సంబంధిత కాంట్రాక్టు సంస్థల నుంచి నిధులను రికవరీ చేయించాలంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నివేదించిందని తెలిపారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటికైనా పెండింగ్‌ విజిలెన్స్‌ రిపోర్టులను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పద్మనాభరెడ్డి డిమాండ్‌ చేశారు.