తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ విద్యార్థికి ఐఎఫ్‌ఎస్‌

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థి కే రాజు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు. జనగామ జిల్లా సూరారం గ్రామానికి చెందిన రాజు ములుగు ఫారెస్ట్‌ కాలేజీలో 2017 బ్యాచ్‌లో బీఎస్సీ పూర్తి చేశారు. జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఫారెస్ట్‌ కాలేజీని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కాలేజీల్లో ర్యాంకులు పొంది ఉన్నత విద్యను ఫారెస్ట్‌ కాలేజీ విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన సందర్భంగా సీఎం కేసీఆర్‌తోపాటు కాలేజీ నెలకొల్పడంలో భాగమైన అధికారులకు రాజు కృతజ్ఞతలు తెలిపారు.