ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌ నియంత్ర‌ణ పాటించాలి: సీఎం కేసీఆర్‌

భారీ వ‌ర్షాల‌పై ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ స్వీయ‌నియంత్ర‌ణ పాటించాల‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించిన‌ట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, దక్షిణ ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ మీదుగా సైక్లోన్ ఎఫెక్ట్ ఉంద‌ని, నాలుగైదు రోజులు తెలంగాణ‌వ్యాప్తంగా అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. గోదావ‌రిలో స‌మ్మ‌క్క బ్యారేజీ ద‌గ్గ‌ర 9 ల‌క్ష‌ల ప‌దివేల క్యూసెక్కుల ఫ్లో వ‌స్తున్న‌దని చెప్పారు. ఎస్సారెస్పీకి 4 వేల క్యూసెక్కుల వ‌ర‌ద‌నీరు వ‌స్తోంద‌ని, రేప‌టివ‌ర‌కూ నిండిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్నారు.

భారీ వ‌ర్షాలతో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగినా వెంట‌నే స్పందించేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను సిద్దం చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ వాళ్ల‌తోకూడా మాట్లాడామ‌ని, అవ‌స‌ర‌మైతే రెండు మూడు హెలిక్యాప్ట‌ర్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని కోరిన‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా రాబోయే మూడు రోజులు అన్నిర‌కాల విద్యాసంస్థ‌ల‌ను మూసివేస్తున్నామ‌ని తెలిపారు. కొంద‌రు వాగులు, క‌ల్వ‌ర్టుల‌పై దుస్సాహసం చేస్తార‌ని, అట్లాంటివి లేకుండా చూడాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీచేశామ‌న్నారు. అలాంటి చోట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆర్టీసీ యాజ‌మాన్యాన్ని కూడా హెచ్చ‌రించిన‌ట్లు చెప్పారు.

ఊళ్ల‌లో కూలిపోయే ద‌శ‌లో ఉన్న పాత ఇండ్ల‌ను ఇప్ప‌టికే కూల‌గొట్టామ‌ని, ఇంకా కొన్ని కోర్టు కేసుల్లో ఉన్న‌ట్లు తెలిపారు. వాళ్ల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేశామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్‌, నిర్మ‌ల్‌లో భారీ వ‌ర్షం కురిసిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, ఏడు చెరువులు తెగిపోయాయ‌ని తెలిపారు. వాటిని పున‌రుద్ధ‌రిస్తామ‌ని తెలిపారు. కొత్త‌గూడెం, నిజామాబాద్‌కు ఎన్టీఆర్‌ఎఫ్ బృందాల‌ను పంపిన‌ట్లు వెల్ల‌డించారు. ద‌య‌చేసి ప్ర‌జ‌లు సాహసాలు చేయొద్ద‌ని, చిన్న‌పిల్ల‌లు, యువ‌కుల‌ను బ‌య‌ట‌కు పోనీయొద్ద‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు యాక్టివ్‌గా ఉండాల‌ని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు హెడ్‌క్వార్ట‌ర్స్‌లోనే ఉండాల‌ని ఆదేశించారు. ఇరిగేష‌న్ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.