వరదలపై సమీక్ష.. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దు: సీఎం కేసీఆర్‌

తెలంగాణలో వానలు, వరదలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా.. వరద పరిస్థితులపై మంత్రులతో ఫోన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.  అలాగే ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారాయన.

దేవాదుల ప్రాజెక్టు ముంపుపై తక్షణం చర్యలు తీసుకోవాలని, సహాయక చర్యల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గత నాలుగైదు రోజులుగా మబ్బులకు చిల్లులు పడినట్లు వాన కురుస్తూనే ఉంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌.. వానల ఉదృతి రిత్యా శనివారం వరకు సెలవులను పొడిగించింది.