- వర్షాకాలంలో చెరువులు, కుంటల్లోకి వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలు
- సంగారెడ్డి, ఆర్.సి.పురం పరిధిలో విచ్చలవిడి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు
- చర్యలు తీసుకోవడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్న పిసిబి అధికారులు
నైరుతి ఆగమనంతో వర్షాలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా ఏదో ఒక చోట భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహంతో పాటే భారీగా మురుగునీరు కుంటలు, చెరువులు, మూసీ, హుస్సేన్ సాగర్ లోకి చేరుతోంది. ఇదే సమయంలో మనుషులకు ఎంతగానో చేటు కలిగించే ప్రమాదకర రసాయన పారిశ్రామిక వ్యర్థాల కట్టడి ఎలాగన్నది అతి పెద్ద సమస్యగా మారింది. వరద నీటితో పాటే రసాయన కాలుష్య వ్యర్థాలు చెరువుల్లో, కుంటల్లో, మూసీలో వచ్చి కలుస్తుంటే కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ఎప్పటిలాగే చూసీచూడనట్లు వదిలేస్తారా..? లేక ఈసారైనా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటారా అన్నది అనుమానంగానే మారింది. పరిశ్రమలు ఇష్టారీతిన రసాయన వ్యర్థాల్ని వదిలేయకుండా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. దీంతో ఈసారి కూడా గత పరిస్థితులే పునరావృతమయ్యే అవకాశాలున్నాయని పర్యావరణ వేత్తలు, పారిశ్రామికవాడల పరిసరాల్లోని స్థానికులు, పొల్యూషన్ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల సగానికిపైగా చెరువులు, కుంటల్లోని నీరు పనికిరాకుండా పోయిందని, ఈసారి కట్టడి చేయకపోతే పరిస్థితి మరింత అదుపు తప్పుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాలైన కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, మల్లాపురం, నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర ప్రాంతాలే కాక సంగారెడ్డి, ఆర్.సి.పురం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో అధికారికంగా, అనధికారికంగా వేల సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలున్నాయి. వీటిలో ఎరుపు, నారింజ కేటగిరీ పరిశ్రమలు కాలుష్యం ఎక్కువగా వెదజల్లుత్తున్నట్లు గతంలో గుర్తించారు. ఇవి కాకుండా ఇళ్లల్లో, గోదాముల్లో కూడా వందల సంఖ్యలో పరిశ్రమలు కొనసాగుతున్నాయి. వీటి నుంచి వెలువడే కాలుష్య కారక జలాలు, వ్యర్థాల్ని శుద్ధిచేసి చెట్ల పెంపకానికి వాడాలి. లేకపోతే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలించి శుద్ది చేయించాలి. కానీ అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఇలా అడ్డదారులు తొక్కుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు ఇలా తయారు కావడానికి పిసిబి అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణం అని పర్యావరణ వేత్తలు చెబుతున్న మాట.
అసలేం జరుగుతుందంటే..?
పీసీబీ అధికారుల ఉదాసీన వైఖరితో కాలుష్య వ్యర్థాల్ని వందలాది పరిశ్రమలు శుద్ధి చేయకుండా వదిలేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా పరిశ్రమల వారు కాలుష్య వ్యర్థాల్ని నాలాల్లోకి వదిలేయడం.. ట్యాంకర్ల ద్వారా అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ వదిలేస్తున్నారు. లేదంటే పరిశ్రమలలోనే బోరు గుంతలలోకీ వదులుతున్నారు. వర్షాకాలంలో మాత్రం కాలుష్య పరిశ్రమలు స్థానిక మురుగుకాల్వల ద్వారా వ్యర్ధాలను గంటల కొద్దీ వదిలేస్తుంటాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధాలు సమీపంలోని నాలాల ద్వారా కుంటలు, చెరువులు, మూసీ, హుస్సేన్ సాగర్ లోకి చేరుతున్నాయి. వర్షం ప్రారంభమవగానే అప్పటి వరకూ నిల్వ ఉంచిన వ్యర్థాల్ని ఒకేసారిగా మురుగుకాల్వల్లోకి వదిలేస్తున్నాయి. ఫలితంగా జల వనరులు కాలుష్యమయంగా మారుతున్నాయి. నగరంలో సుమారు 185 చెరువులు ఉండగా సుమారు 100 చెరువుల్లో కాలుష్యం భారీగా పెరిగింది. వర్షాకాలంలో వీటికి మరింత ముప్పు ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
అంతేకాదు గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలను కొన్ని పరిశ్రమల యజమానులు అనుకూలంగా మార్చుకున్నారు. పరిశ్రమల ఆవరణలో నిల్వ చేసిన కాలుష్య, వ్యర్ధ జలాలను వరదతో బయటకు వదులుతున్నారు. దీంతో నురగలు కక్కుతూ, ఘాటు వాసనలతో ప్రవహిస్తుండటంతో పారిశ్రామికవాడల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటికి మొన్న ఆర్.సి. పురం ఇ.ఇ. రవికుమార్ పరిధిలోని జిన్నారం మండలం గడ్డపోతారం సమీపంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమల వారు రసాయన కాలుష్య జలాలను రోడ్డుపైనే పారబోశారు. దీంతో కళ్లలో మంటలు, ముక్కు పుటాలు అదిరే వాసనతో ఆ ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరి అయినారు. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడకు అనుకుని ఉన్న జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న రోడ్డు గుంతల మయంగా ఉండటం, రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి అందులో నీళ్లు నిలువటంతో ఇదే అదునుగా భావించి సుమారు రెండు ట్యాంకర్ల పారిశ్రామిక రసాయన వ్యర్థాలు అందులో పారబోశారు. దీనిని గుర్తించిన గ్రామస్థులు సత్యనారాయణ, అర్జున్, సుధాకర్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్.సి. పురం ఆర్.ఒ. ఇ.ఇ. రవికుమార్ ఆదేశాలతో ఎ.ఇ.ఇ. భాగ్యలక్ష్మి, ఎ.ఇ.ఎస్. జీమూతవాహన ఇతర సిబ్బంది వచ్చి అక్కడి పరిస్థితిని పరిశీలించి, నీటి నమూనాలు సేకరించి వివిధ పరిశ్రమల వద్ద ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. అందులో స్పష్టత లేదని ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నీటి నమూనాల ఫలితాల ప్రకారం ఏ పరిశ్రమ నుంచి తెచ్చారో తేలుస్తామన్నారు. గుంతల్లో నీళ్లు ఉండటం, రసాయన ఘాటు వల్ల ఆ మార్గంలో వాహనాలు వెళ్లినా రెండు మూడు కిలోమీటర్ల వరకు వాసన వ్యాపిస్తుందని పేర్కొన్నారు. రసాయనాల ఘాటుతో పాటు ఫోమ్ కూడా ఉన్నట్లు తెలిపారు.
బొంతపల్లి పరిశ్రమల తీరువల్ల జిన్నారం రాయుని చెరువు, గడ్డపోతారం పరిశ్రమల కారణంతో అయ్యమ్మచెరువు, కిష్ణాయపల్లి మల్లెంచెరువు, ఖాజీపల్లి ధర్మచెరువు విషపూరితంగా మారాయి. ఖాజీపల్లి, గడ్డపోతారంలో కొన్ని పరిశ్రమల వల్ల ఖాజీచెరువు, గండి చెరువు కాలుష్యమయంగా దర్శనమిస్తున్నాయి. ఇంతగా పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే పొల్యూషన్ కారకులపై చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారులు మాటలు చెప్తున్నారే తప్ప పొల్యూషన్ పరిశ్రమలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వచ్చిన ఫిర్యాదులను పిసిబి అధకారులు తమ స్వలాభం కోసం వాడుకొని సొమ్ము చేసుకుంటున్నారు తప్ప పొల్యూషన్ చేసిన రసాయన పరిశ్రమల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా తెల్వడం లేదని స్థానికులు చెబుతున్నారు.
అంతేకాదు సంగారెడ్డి పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ని ఫిర్యాదులు చేసిన అక్కడి పిసిబి అధికారులకు పట్టడం లేదని పొల్యూషన్ బాధితులు వాపోతున్నారు. పటాన్ చెరువు నుండి జహీరాబాద్ వరకు పరిశ్రమల యాజమాన్యాలు రసాయన వ్యర్ధ జలాలను విచ్చల విడిగా వదులుతూ స్థానిక చెరువులు, కుంటలను కలుషితం చేస్తున్నాయని.. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఉన్న క్రషర్లను వెంటనే మూసివేయాలని పర్యావరణ వేత్తలు, ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన ప్రయోజనం లేదంటేనే అర్ధం అవుతుంది. ఇక్కడి పిసిబి అధికారులు ఎంత చిత్తశుద్దితో పనిచేస్తున్నారో..
వర్షాకాలాన్ని పరిశ్రమల యాజమాన్యాలు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎన్నో రోజులుగా పరిశ్రమలో నిల్వ చేసిన రసాయన వ్యర్థ జలాలను వరద నీటిలో కలిపి బయటకు యదేచ్ఛగా వదులుతున్నారు. ఫలితంగా నీటి వనరులు, పంట పొలాలు కలుషితం అవుతున్నాయి. హత్నూర మండలం బోర్పట్ల గుండ్లమాచునూర్, చందాపూర్, తుర్కలఖానాపూర్ గ్రామాల్లో ఈ సమస్య తీవ్రమైంది. ప్రతి వర్షా కాలంలో ఈ సమస్య పునరావృతం అవుతున్నా.. పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విఫలమవుతున్నారు. ఇక్కడి పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విషతుల్యమైన వ్యర్థ జలాలు పక్కనే ఉన్న నక్కవాగులోకి, అక్కడి నుంచి మంజీరలో కలుస్తూ నది నీటిని కలుషితం చేస్తున్నాయి. వారం రోజుల క్రితం హత్నూర మండలం పన్యాల శివారులో మంజీర నదీపైన కట్టిన చెక్ డ్యాంను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. అక్కడి కాలుష్య జలాలను చూసి నివ్వెరపోయారు. పరిశ్రమల నుంచి పది కి.మీ. దూరంలోనూ నీళ్లు పచ్చగా ఉండటంతో పిసిబి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నదీలోని నీటిని తాగేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అక్కడి రైతులు పేర్కొంటున్నారు.
సంగారెడ్డి, ఆర్.సి. పురం ఆర్.ఒ.ల పరిధిలో పరిశ్రమలు విచ్చల విడిగా కాలుష్యం చేస్తున్న అక్కడి పిసిబి అధికారులకు భారీగా అందుతున్న మాముళ్ల కారణంగా కాలుష్య పరిశ్రమలపై ఎలాంటి చర్యలు ఉండడం లేదని స్థానికులు, పొల్యూషన్ బాధితులు వాపోతున్నారు. సంగారెడ్డి, ఆర్.సి. పురం ఆర్.ఒ.ల పరిధిలో పిసిబి అధికారుల కనుసన్నల్లో ఉండే ఉండే కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా వసూళ్లకు వస్తున్నారని పరిశ్రమల యాజమాన్యాలు కూడా వాపోతున్నాయి. పిసిబి అధికారులకు భారీగా లంచాలు ఇస్తున్నాం కాబట్టే పొల్యూషన్ చేస్తున్నాం అనే విధంగా కాలుష్య పరిశ్రమల యాజమాన్యాల తీరు ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. పిసిబి అధికారులు, కాలుష్య పరిశ్రమల యాజమాన్యాల తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మేధావులు, పర్యావరణ వేత్తలు చెబుతున్నా మాట. సంగారెడ్డి, ఆర్.సి. పురం ఆర్.ఒ.ల పరిధిలో పిసిబి అధికారులు చేస్తున్న అవినీతిపై పూర్తి సమాచారం రాబోయే వ్యాసంలో…