• మైనింగ్ ఏర్పాటు వద్దంటూ అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ముద్విన్ గ్రామస్తుల విన్నపం
మైనింగ్ లీజ్ పేరుతో క్రషర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి తమ బతుకులు ఆగం చేయొద్దని ముద్విన్ గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరారు. కడ్తాల మండలం ముద్విన్ గ్రామ సమీపంలోని నల్లగట్ట వద్ద మైనింగ్ ప్లాంట్ ఏర్పాటును ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించారు. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి నల్లగుట్టను నమ్ముకుని జీవనం పొందుతున్నామని గ్రామస్థులు వాపోయారు. ముద్విన్ గ్రామ సమీపంలోని సర్వేనెం. 95లో 63.36 హెక్టారుల విస్తీర్ణంలో రఫ్ స్టోన్ క్రషర్ ప్లాంట్ ఏర్పాటుపై బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, రైతులు, వివిధ కులవృత్తుల వారు పాల్గొన్నారు. వారి నుంచి నల్లగుట్ట వద్ద క్రషర్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరించారు. ఈ సందర్భంగా వారంతా క్రషర్ ఏర్పాటు చేయొద్దని అధికారులకు తెలిపారు. క్రషర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే వాతావరణం కాలుష్యమై సమీప పంట పొలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జలవనరులు కాలుష్యబారిన పడుతాయని, పాడిపంటలు దెబ్బతింటాయని చెప్పారు. మూగజీవాలు సైతం అనారోగ్య బారినపడుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రతిపాదిత రఫ్ స్టోన్ క్రషర్ ప్లాంట్ ఏర్పాటు ప్రదేశంలో తాటి వనాలను నమ్ముకుని వందలాది గీతకార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, వారంతా రోడ్డున పడతారని వాపోయారు. గ్రామ సమీపంలోని నల్లగుట్టను నమ్ముకుని గొర్రెల, మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నామని, క్రషర్ ఏర్పాటుతో తాము ఎక్కడికి వెళ్లి జీవించాలని గొర్రెల, మేకల పెంపకందారులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. ఈసంద ర్భంగా సీఐ జాల ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్య క్రమంలో ఆర్డీవో వెంకటాచారి, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి వెంకన్న, ఏసీపీ కుశల్కర్, తహసీల్దార్ మహేందర్రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, మైనింగ్ ఏడీ సర్పంచ్ యాదయ్య, తదితరులు ఉన్నారు.