క్రషర్ల దుమ్ము ధూళితో వ్యవసాయం మానుకున్నాం

లక్దారం గ్రామంలో దుమ్ముధూళితో వ్యవసాయం మానుకున్నామని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు మండలం లక్షారంలో ఉయ్యాల నారాయణ రఫ్ స్టోన్ సంస్థ, సాయి సూపర్ సాండ్ మినరల్స్ సంస్థల కొత్త క్రషర్ల విస్తరణకు అనుమతుల కోసం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, పీసీబీ ఇ.ఇ. సురేష్ కుమార్ , ఆర్డీవో నగేష్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. లక్దారంతో పాటు సమీపంలోని గ్రామాలు, తండాల ప్రజలు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చారు. గ్రామ ప్రజలు, యువకులు, రైతులు గ్రామ పరిధిలో పెద్ద ఎత్తున ఏర్పాటైన క్రషర్లతో నరకం అనుభవిస్తున్నామని ఆరోపించారు. భారీగా నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ తో సమీపంలో ఉన్న భూముల్లో పంటలు పండించలేని దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. వారు గ్రామాభివృద్ధి అని మభ్యపెడుతారని, కానీ ఏ అభివృద్ధి చేయరని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ముధూళి లేవదని పీసీబీ అధికారులు చెప్తారని కానీ, పెద్ద చెరువు వరకు బండరాళ్లు ఎగిరిపడి చెరువు ధ్వంసం అవుతున్నదని తెలిపారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో ప్రజలు అనారోగ్యా లకు గురవుతున్నారన్నారు. ఇప్పుడు క్రషర్లు పెడుతున్న చోటు గొప్ప అధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతమని గ్రామ యువకుడు వీరేశం చెప్పాడు. ఓవర్ లోడ్ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని సలావుద్దీన్ అనే యువకుడు తెలిపాడు. గ్రామానికి అసలు క్రషర్లే వద్దని పేర్కొన్నారు. గ్రామ నాయకులు క్రషర్ల సాయంతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధికి క్రషర్లు కావాలని కోరారు. స్పందించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి గ్రామంలో నిబంధనల మేరకు క్రషర్లు ఏర్పాటు చేసేందుకు యాజమాన్యాలు ముందుకు వచ్చాయన్నారు. ప్రజలు ఇచ్చే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. నిర్మాణ రంగం, రవాణారంగం వేగంగా అభివృద్ధి చెందు తున్నందుకు క్రషర్ల అవసరం ముఖ్యమైనదేనని అధికారులన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, కృష్ణాగౌడ్, మల్లేశం, మధు సూదన్, గోపాల్రెడ్డి, చంద్ర శేఖర్ గౌడ్, డీఎస్పీ భీంరెడ్డి, తహసీల్దార్ మహిపాల్రెడ్డి, సీఐ వేణుగోపాల్రెడ్డి, పీసీబీ, మైన్స్ శాఖ అధికారులు, క్రషర్ల యాజమాన్యాలు, సిబ్బంది పాల్గొన్నారు.