• కనీస జాగ్రత్తలు పాటించని రసాయన పరిశ్రమలు.. పట్టించుకొని అధికారులు..
• ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతుతున్నఅమాయకపు ప్రాణాలు..
• స్పష్టంగా కనిపిస్తున్న నల్లగొండ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి నిర్లక్ష్యం..
• కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉండడు అంటున్న బాధితులు..
• ఆ అధికారి సమయం అంతా వసూళ్ల పైనే అంటున్న బాధితులు..
• అవినీతి అధికారుల నిర్లక్ష్యం.. కార్మికుల జీవితాలతో చెలగాటం..
రసాయన పరిశ్రమల పేరు వింటేనే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఉలిక్కిపడే పరిస్థితి దాపురించింది. రియాక్టర్లే అణు బాంబుల్లా పేలుతున్నాయంటే పరిశ్రమల యజమాన్యాలు, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పరిశ్రమల వారు పాటించాల్సిన కనీస జాగ్రత్తలు గాలికి వదిలేస్తుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తరుచూ ఏదో ఒక చోట పరిశ్రమలలో ప్రమాదం సంభవిస్తూనే ఉంది. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు హడావుడి చేసి ఆ మరుసటి రోజే మరిచిపోతుండటం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి వచ్చే పరిశ్రమలు 1,000 కి పైగా ఉన్నాయి. అధికంగా కాలుష్యం వెలువడే రసాయన పరిశ్రమలు రాజధానికి సమీపంలోని బీబీనగర్, భువనగిరి, బొమ్మలరామారం, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్, చిట్యాల మండలాల్లో అధికంగా ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రసాయన పరిశ్రమల వల్ల అధిక కాలుష్యంతో పాటు ప్రమాదాలు కూడా అదేస్థాయిలో జరుగుతున్నాయి. రసాయన పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారే కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతుండగా, మరేందరో కార్మికులు క్షతగాత్రులుగా మారి ఆసుపత్రుల పాలవుతూ తమ జీవితాలను కోల్పోవడమే కాకుండా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది ఎవరికి పట్టని విషయంగా మారింది.
రసాయన పరిశ్రమలలో జరిగిన ప్రమాదాలు మచ్చుకు కొన్ని…
• తాజాగా వెలిమినేడులోని హిండిస్ ల్యాబ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
• వెలిమినేడులోని హిండీస్ ల్యాబ్ పక్కనే ఉన్న క్రితిక్ లేదా ఫ్యూయల్స్ రబ్బరు పరిశ్రమలో జూలైలో, ఆరు నెలల క్రితం బాయిలర్ లీకై మంటలు వ్యాపించాయి.
• గత మూడేళ్ల కిత్రం వెలిమినేడు శివారులోని దశమి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు యువకులు మృతి చెందారు.
• ఈ ఏడాది దేవలమ్మ నాగారంలోని నోష్ ల్యాబ్ లో రసాయనాలు విడుదలై నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
• చౌటుప్పల్ లోని శ్రీని ఫార్మా, మాందోల్లగూడెంలోని ఫ్యూజన్ ల్యాబ్, దండుమల్కాపురంలోని జయ ల్యాబ్ పరిశ్రమల్లో కూడా రియాక్టర్లు పేలి ప్రమాదాలు సంభవించాయి. ప్యూజన్ ల్యాబ్ లో ముగ్గురు కార్మికులు అస్వస్థకు గురికాగా, జయ ల్యాబ్ లో ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
• భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని విజేసాయి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 11 మంది కార్మికులు, చౌటుప్పల్ మండలం జైకేసారంలోని ఎస్ఆర్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ముగ్గరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు పరిశ్రమల్లోనూ రియాక్టర్లే పేలాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు చాలానే జరిగాయి.
తూ తూ మంత్రంగానే పరిశ్రమల్లో అధికారుల తనిఖీలు :
రసాయన పరిశ్రమలను సంబంధిత శాఖల అధికారులు తనిఖీ చేయకపోవడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా పరిశ్రమలను పరిశ్రమల శాఖ, పీసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సంబంధిత శాఖల అధికారులు తమ విధిని సక్రమంగా నిర్వహించడం లేదని బాధితుల నోట వినిపిస్తున్నమాట. చాలా రసాయన పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా తనిఖీలకు వచ్చిన అధికారులకు లంచాలు ఇస్తున్నాయనే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యంతో రసాయన పరిశ్రమలలో యంత్రపరికరాలు సరిగ్గా పని చేయక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమలలో విధి నిర్వహణలో ఉన్న కార్మికుల కోసం భద్రత పరికరాలను పరిశ్రమల యాజమాన్యాలు సక్రమంగా అందించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖల అధికారులు లంచాలు తీసుకుంటూ తమ విధులను మరిచి తూ తూ మంత్రంగా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని హిండిస్ ఫార్మా పరిశ్రమలో బుధవారం రోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానిక గ్రామాల ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేకం జరుగుతున్నా అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది.
ఫార్మా పరిశ్రమల యజమాన్యాల నిర్లక్ష్యానికి బలి అవుతున్ననిండు ప్రాణాలు :
ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారిని, మరీ ముఖ్యంగా తెలుగు రాని వారిని ఉత్పత్తి విభాగంలో తక్కువ వేతనాలకు పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను ఏర్పాటు చేసుకోవడం.. వారి భద్రతకు సంబంధించిన సరైన సామాన్లను ఇవ్వకపోవడం.. పరిశ్రమలోని ప్రమాదకరమైన ప్రాంతాలలో టెక్నికల్ సిబ్బంది కాకుండా.. నాన్ టెక్నీకల్ సిబ్బందిని నియమించడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అనేకం ఉన్నాయి.
ఫార్మా పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యంతో నల్లగొండ జిల్లాలో తరచూ రసాయన పరిశ్రమలలో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నా.. చాలావరకు గుట్టుచప్పుడు కాకుండా.. బయటి ప్రంపంచానికి తెలియకుండా చేస్తున్నారు. గత నాలుగు నెలల క్రితం ఒక భారీ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం జరిగిన విషయం సంబంధిత అధికారులకు సమాచారం లేదంటే.. అధికారుల పని తీరు ఏ స్థాయిలో, ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం అవుతోంది.
నల్లగొండ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి అవినీతిపై ఫిర్యాదులు :
నల్లగొండ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి పరిశ్రమలను సందర్శించి, భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేయాల్సి ఉండగా.. తన విధులను నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. పరిశ్రమల వారి నుండి లంచాల వసూళ్లపైనే పూర్తిగా సమయం వెచ్చిస్తున్నారని పలువురు పర్యావరణ వేత్తలు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా వెంటనే ఆ అధికారిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, వెంటనే విధుల నుండి తొలగించాలని, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సమర్ధుడైన మరో అధికారిని నియమించాలని కోరారు.
“రాజకీయ పలుకుబడి, అవినీతి సొమ్ముకు (లంచాలకు) లోంగే అధికారులు ఉంటే.. అమాయక కార్మికుల ప్రాణాలు దారుణంగా బలితీసుకునే ఇలాంటి ఫార్మా పరిశ్రమలపై ఎలాంటి చర్యలు ఉండవని పలువురి నోట వినిపిస్తున్న మాట. సామాన్యు కార్మికుల ప్రాణాలను తీసే హక్కు పరిశ్రమల యాజమాన్యాలకు ఉందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రసాయన పరిశ్రమలలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా.. పరిశ్రమల యాజమాన్యాలు నిరాటంకంగా తమ పనులను తాము చేసుకుంటూ భారీగా సంపాదించుకుంటూ పోతున్నారు. మరి కార్మికుల ప్రాణాలను కాపాడే వారు ఎవరు..? బాధ్యతగా పనిచేయాల్సిన అధికారులే తమ బాధ్యతను మరిస్తే ఈ అన్యాయాలను, అక్రమాలను నిరోధించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది..? ఎవరు ఆ బాధ్యతను తీసుకుంటారు..? సామాన్యుల నుండి ఇలా జవాబులేని ప్రశ్నలు ఎన్నెన్నో వినిపిస్తున్నాయి.” ఇలాంటి సంఘటనలు జరుగుతున్న పరిశ్రమలపై సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకొని తమ చిత్తశుద్దిని (తమ విధిని) చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు, మేధావులు, బాధితులు అంటున్నారు. లేదంటే అవినీతి అధికారులపై విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయక తప్పదు అని పర్యావరణ వేత్తలు, మేధావులు, బాధితులు హెచ్చిరిస్తున్నారు.