ఏసీబీకి చిక్కిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇంచార్జి తాసిల్దార్‌

పట్టాలో పేరు మార్పు కోసం లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇంచార్జి తాసిల్దార్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. నిజామాబాద్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కూమార్‌ కథనం ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన మండ్ల బలరామ్‌ పెద్దమ్మ దన్నెపు రాజవ్వ రెండేండ్ల క్రితం మరణించింది. వారసులు లేకపోవడంతో పెద్దమ్మ పేరిట ఉన్న 37గుంటల భూమిని తన పేరుపైన పట్టా చేయాలని తాసిల్‌ కార్యాలయానికి వెళ్లగా.. ఇంచార్జి తాసిల్దార్‌ మానస రూ.5వేలు లంచం డిమాండ్‌ చేసింది. చివరకు రూ.4 వేలకు అంగీకరించింది. గురువారం బలరామ్‌ నుంచి తాసిల్దార్‌ తరఫున ధరణి ఆపరేటర్‌ లక్ష్మణ్‌ రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తరువాత లక్ష్మణ్‌తోపాటు తాసిల్దార్‌ మానసను అదుపులోకి తీసుకున్నారు.