మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగించింది. ప్ర‌తి రౌండ్‌లోనూ అధికార పార్టీ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించి, విజ‌యాన్ని ముద్దాడింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వానికే మునుగోడు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. క‌మీష‌న్ల కాంట్రాక్ట‌ర్‌కు చ‌ర‌మ‌గీతం పాడి, అన్ని వ‌ర్గాల అభివృద్ధే ల‌క్ష్యంగా, సంక్షేమ‌మే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న అధికార పార్టీకే జై కొట్టారు. భార‌త్ రాష్ట్ర స‌మితికి పునాది రాయి వేసి.. దేశ దృష్టిని ఆక‌ర్షించారు మునుగోడు ఓట‌ర్లు. నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ సామాన్యుడి న‌డ్డి విరుస్తున్న మోదీకి క‌నువిప్పు క‌లిగించారు. బీజేపీ ఆట‌లు, మోదీ మోసాలు తెలంగాణ‌లో సాగ‌వ‌ని నిరూపించారు మునుగోడు ప్ర‌జ‌లు. ప్ర‌తిప‌క్షాల ఆశ‌ల‌ను చిత్తు చేసింది.

టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి 11,666  ఓట్ల‌ మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రెండో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది.  పాల్వాయి స్ర‌వంతికి కనీసం డిపాజిట్ రాలేదు.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ మూడింటింటిలోనూ టీఆర్ఎస్ పార్టీ విజ‌య ఢంకా మోగించింది. హుజుర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి భార్య ప‌ద్మావ‌తిపై టీఆర్ఎస్ అభ్య‌ర్థి శానంపూడి సైదిరెడ్డి 43,359 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో నోముల న‌ర్సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్ గెలుపొందారు. నోముల భ‌గ‌త్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా స‌మీప ప్ర‌త్య‌ర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కుందూరు జానారెడ్డి రెండో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు.