పొగమంచు.. పొల్యూషన్.. పరేషాన్‌

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం క్రమేపీ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోంది. సనత్‌నగర్‌లో మంగళవారం (ఈ నెల 8న) ఏకంగా 228 పాయింట్లు నమోదైంది. చలి పెరుగుతున్న కొద్దీ గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పొగమంచు ఎక్కువే కాలుష్యాన్ని పట్టి ఉంచడంతో గాలి నాణ్యత క్షీణిస్తోంది. రోజు రోజుకు గాలిలో (పీఎం 10) అతి సూక్ష్మ దుమ్ము కణాలు (పీఎం 2.5) పరిమితికి మించి నమోదవుతున్నాయి. దీని వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగించడం, ఆస్తమా వంటి వ్యాధుల బారినపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గాలిలో పీఎం 2.5 పరిమితి 100 పాయింట్లు దాటిన దగ్గర నుంచీ సమస్యలు మొదలైనట్లే అని పేర్కొంటున్నారు. సనత్‌నగర్‌, జూపార్క్‌, బొల్లారం, పాశమైలారం, హెచ్‌సీయూ ప్రాంతాల్లో గాలి నాణ్యతలో మార్పులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఆర్‌సీపురం, నాచారం, కొత్తపేట, కాప్రా ప్రాంతాల్లో మోడరేట్‌గా ఉందని పీసీబీ డాటాను బట్టి తెలుస్తోంది.

పీసీబీ ప్రధాన కార్యాలయం వద్దే ప్రమాదకరంగా..

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఉన్న సనత్‌నగర్‌లో గాలి కాలుష్యం నగరంలోని ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంది. గడిచిన రెండు రోజులుగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గతంలో పారిశ్రామిక ప్రాంతంగా వెలిగిన సనత్‌నగర్‌ ఇప్పుడు కోర్‌ సిటీలో భాగమైంది. సనత్‌నగర్‌లో పరిశ్రమల సంఖ్య తగ్గి, నివాస ప్రాంతాలే ఎక్కువగా ఉన్నా గాలి కాలుష్యం పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినపుడు, ఆయా ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, పీసీబీ కార్యాలయం వద్దే పరిస్థితి క్షిణిస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో పీఎం 2.5 200 పాయింట్లు దాటితే శ్వాస కోశ సమస్యలతో పాటు, ఇతర వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చలికాలం వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు జిల్లాల్లో పొగమంచుకు పొల్యూషన్ తోడైంది. ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉదయం 8 గంటలైనా పొగ మంచు తగ్గడం లేదు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండి ప్రజలపై మంచు దుప్పటి కప్పేస్తోంది. చలికాలంలో పరిమితి వేగం ముఖ్యమని వాహనదారులను పోలీసు శాఖ, కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరిస్తున్నా పొల్యూషన్ కట్టడి కోసం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో పరిశ్రమలు పొల్యూషన్ ఎక్కువగా చేస్తుండటంతో పొగమంచు.. పొల్యూషన్ కారణంగా పలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
* చౌటకూర్ మండలం తాడ్ దాన్ పల్లి చౌరస్తా వద్ద బుధవారం ఉదయం 7 గంటల టైంలో వ్యాన్, ఆటో ఢీకొని ఇద్దరు యువకులు చనిపోయారు.
* అందోల్ మండలం కన్సన్ పల్లి నాందేడ్ అకోలా నేషనల్ హైవేపై గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరే కాక అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు.

ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వాతావరణ మార్పులను ముందుగానే గుర్తించి కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకొవాలని పర్యావరణ వేత్తలు, రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు, పొల్యూషన్ బాధితులు అంటున్నారు.