ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలి : జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 829లో కంకర క్రషర్ పై ఈనెల 18వ తేదీన నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని కోరుతూ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ శరత్ ను కలిసి శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. రెండు నెలల క్రితం క్రషర్ల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలకు వచ్చిన జిల్లా అధికారులకు గ్రామస్తులు అధ్వర్యంలో అధికారులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయని, దీంతో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో స్వల్ప లాఠీచార్జ్ సంఘటన జరిగినట్లు గుర్తు చేశారు. ఈ ప్రక్రియపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా 2005వ సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా సర్వేనెంబర్ 829 లోని భూమిని బడుగు బలహీన వర్గాలయైన నిరుపేదలకు జీవనోపాధి పొందడం కోసం అందజేయగా ప్రస్తుతం ఆ భూముల్లో కంకర క్రషర్లు ఏర్పాటు చేయడం సరికాదంటూ నిరసన వ్యక్తం చేశారు.