• జిన్నారం మండలంలో కంకర క్వారీల ‘కాక’
• ప్రజలు వ్యతిరేకించినా నెలకో గ్రామంలో భూముల స్వాధీనం
• నేడు ఊట్లలో అభిప్రాయ సేకరణ. గతంలో రసాభాస
జిన్నారం మండలంలో మరోసారి కంకర క్వారీల రాక రాజుకుంటున్నది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవడంతో ఊటల్లో నిలిచిపోయిన ప్రజాభిప్రాయ సేకరణ మరోసారి తెరపైకి వచ్చింది.. నూతన స్టోన్ క్రషర్, క్వారీల ఏర్పాటు కోసం నేడు మరోసారి అభిప్రాయసేకరణ చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్తగా కొడకంచిలో మరో క్రషర్ ఏర్పాటుకు భూ పరిశీలన చేశారు.
భారీగా దరఖాస్తులు
రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతమైన జిన్నారం మండలం నిత్యం కంకర క్వారీల పేలుళ్లతో దద్దరిల్లుతున్నది. ఇప్పటికీ మండలంలో 16 స్టోన్ క్రషర్లు ఉండడంతో వాయు, శబ్ద కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర క్వారీల ఏర్పాటును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కొత్త వాటి ఏర్పాటు కోసం బారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తున్నది. ఊట్ల, కొడకంచి, దాది గూడెం, సౌలకపల్లి, శివానగర్, మాదారం. కాజీపల్లి గ్రామాల పరిధిలో స్టోన్ క్రషర్ల ఏర్పాటు కోసం మైనింగ్, రెవెన్యూ శాఖలకు 200 పైగా దరఖాస్తులు అందినట్టు సమాచారం. నగర శివారు ప్రాతం కావడం.. భారీగా కొండలు ఉండలు ఉండడం, రవాణా కోసం ఔటర్ రింగురోడ్డు పక్కనే ఉండడంతో కొత్త క్వారీల ఏర్పాటుకు క్యూ కట్టారు. కానీ కొత్త క్వారీలకు అనుమతి ఇస్తే గ్రామాల్లో జీవించలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యూహాత్మకంగా అభిప్రాయ సేకరణ.
క్వారీల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటికి ఒకేసారి అనుమతులు ఇస్తే ఆందోళనలు జరుగుతాయని అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలలకో దరఖాస్తును ముందుకు తెచ్చి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఇప్పటికే రాళ్లకత్వ, మాదారం, కాజీపల్లి పరిధిలో క్వారీల పనులు ప్రారంభించారు. ఈ నెల 11న కొడకంచి శివారులో క్రషర్ ఏర్పాటు కోసం అధికారులు స్థల పరిశీలన చేపట్టగా ప్రజాప్రతినిఽధులు, నాయకులు అడ్డుకున్నారు. ఊట్ల శివారులో స్టోన్ క్రషర్ ఏర్పాటు కోసం ఆగస్టు 28న చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన వేదికను ఆందోళనకారులు కూల్చేశారు. టెంట్లు తగలబెట్టారు. కుర్చీలు విరగొట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి ప్రజలను చెదరగొట్టారు. నాడు రద్దయిన ఆభిప్రాయ సేకరణను తిరిగి నేడు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఊట్లలో అభిప్రాయ సేకరణ చేపట్టవద్దని ఈ నెల 11న స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
నాయకుల ద్విపాత్రాభినయం
క్వారీలు, స్టోన్ క్రషర్ల ఏర్పాటులో మండలంలో నాయకులు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట క్రషర్లు వద్దని అందోళనలు చేస్తున్న నాయకులు. తెర వెనుక వ్యాపారులతో కుమ్మకై లోపాయకారిగాా సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ గ్రామంలో క్వారీల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. దీంతో స్టోన్ క్రషర్ పనులు ఏడాది పాటు నిలిచిపో యాయి. తాజాగా మరోసారి అభిప్రాయ సేకరణ నిర్వహించగా గతంలో ఉద్యమాలు చేసినవారు గ్రామ అభివృద్ధికి సహకరిస్తే క్రషర్ల ఏర్పాటుకు అనుకూలమే అని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ క్రషర్ కోసం అభిప్రాయ సేకరణకు ముందే యాజమాన్యం నాయకులకు బారీగా ముడుపులు ఇచ్చారనే ప్రచారం జరుగుతున్నది. మరో గ్రామంలో క్వారీ ఏర్పాటును అడ్డుకున్న వ్యవహారంలోనూ ఆ తరువాత కొందరు గ్రామ, మండల స్థాయి పెద్దలు బారీగా లబ్ధిపొందారని, దీంతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా క్రపర్లు ఉన్న మరో గ్రామ పరిధిలో ఓ క్రషర్ యాజమాన్యంపై భూ ఆక్రమణలు, మైనింగ్ పరిధి చాటి తవ్వకాలు, ఇతర ఆరోపణలు గుప్పుమన్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు అండగా ఉండడంతోనే ఆ యాజమాన్యం బరితెగించిందని ఆరోపణులు ఉన్నాయి. ఇక కొత్త క్రవర్ల ఏర్పాటుపైనా కొందరు నాయకుల తీరు అనుమానాస్పదంగా ఉన్నది. స్థానికులతో కలిసి ఆందోళనలు చేయటం, ఆపై యాజమాన్యలతో ఒప్పందాలు చేసుకుని లోపాయకారిగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
మహేశ్వరి మినరల్స్ పై అభిప్రాయ సేకరణ
* అనుమతి రెన్యూవల్ కోసం సమావేశం
* అభ్యంతరం చెప్పుని గ్రామ ప్రజలు
గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ముద్ద పరి శ్రమ మహేశ్వరి మినరల్ కు అనుమతి రెన్యూవల్ కోసం చేపట్టిన ప్రజాబిప్రాయ సేకరణ సాఫీగా సాగింది. ప్రభుత్వ అనుమతుల సమయం ముగిసిపోవడంతో తిరిగి అనుమతుల కోసం యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నది. దీనిపై జిల్లా అధికారులు గురువారం గ్రామంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ఆయా గ్రామాల ప్రజలెవరూ పరిశ్రమ కొనసాగింపుపై వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. ప్రజల అభిప్రాయాన్ని కలెక్టరుకు నివేదిస్తామని, ఆయన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అదనపు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో పీసీబీ అధికారులు, సర్పంచ్ లు అంజనేయులు, శంకర్, ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి, డిఎస్పీ, బీమ్ రెడ్డి, ఎస్సై విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.(సోర్స్: ఆంధ్రజ్యోతి)