సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అడవుల సంరక్షణ : మంత్రి అల్లోల‌ ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగించి అట‌వీ ప్రాంత అభివృద్ధికి, అటవిపై ఆధార‌ప‌డ్డ అట్టడుగు వ‌ర్గాల‌కు ఆర్థిక చేయూత‌ను అందించే విధంగా అట‌వీ శాఖ చ‌ర్యలు తీసుకుంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

యూఎస్ ఎయిడ్‌ , కేంద్ర అటవీ పర్యావరణ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమంలో భాగంగా డెసిషన్ సపోర్ట్ సిస్టం – ఆగ్రోఫారెస్ట్రీ వెబ్ పోర్టల్, క‌మ్యూనిటీ బేస్డ్ ఎకో సిస్టం టూరిజం, ఆగ్రోఫారెస్ట్రీ టూల్ అండ్‌ షేరింగ్ ఆఫ్ ల్యాండ్‌స్కేప్ మేనేజ్‌మెంట్, ప్లానింగ్ అండ్ వర్కింగ్ ప్లాన్ మాన్యువల్ ను మంత్రి లాంఛ‌నంగా ప్రారంభించి మాట్లాడారు.

అటవీ అభివృద్ధి, అడ‌వుల పునరుజ్జీవనం, హరిత‌హారం కార్యక్రమంలో భాగంగా పచ్చదనం పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం కోసం చేస్తున్న కృషిని వివ‌రించారు. నీటిపారుద‌ల ప్రాజెక్టులు, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, చెక్ డ్యాంల నిర్మాణం లాంటి నీటి వ‌న‌రుల సంర‌క్షణ చ‌ర్యల వ‌ల్ల భూగ‌ర్భ జలాల మ‌ట్టం పెరిగిందన్నారు. హ‌రిత‌హారం కార్యక్రమం ద్వారా తెలంగాణ హ‌రిత రాష్ట్రంగా మారుతుంద‌ని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్, పాలిటిక్స్ అండ్ ఎకాన‌మిక్స్ చీఫ్ షాన్ రూత్, హైద‌రాబాద్, అట‌వీ శాఖ స్పెష‌ల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ అండ్‌ సీఈవో (కంపా) లోకేష్ జైస్వాల్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా సీనియ‌ర్ ఫారెస్ట్రీ అడ్వైజ‌ర్ వ‌ర్గీస్ పాల్, ఫారెస్ట్ ప్లస్ 2.0 చీఫ్ ఆఫ్ పార్టీ ఉజ్వల్ ప్రధాన్, మెదక్ అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఫారెస్ట్ ప్లస్ రీజనల్ డైరెక్టర్ జి. సాయిలు, అటవీ శాఖ సర్కిల్ హెడ్ లు, అన్ని జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.