గ్రామస్థులు లేకుండానే ప్రజాభిప్రాయ సేకరణ

• మరోసారి బహిష్కరించిన ఊట్ల, రాళ్లకత్వ గ్రామస్థులు
• 11 నిమిషాలు.. పాల్గొన్నది నలుగురు..
• క్వారీల అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ తీరిది.

కేవలం 11 నిమిషాలు… నలుగురి అభిప్రాయంతో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసినట్లు అధికారులు ప్రకటించి వెళ్లిపోయారు. శుక్రవారం జిన్నారం మండలం రాళ్లకత్వ, ఊట్ల పరిధిలోని 288, 829/1 సర్వే నెంబర్ లలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కుమార్ పటాక్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను తూతూమంత్రంగా ముగించారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమానికి రెండు గ్రామాలకు చెందిన ప్రజలు రాలేదు. ఊట్లకు చెందిన ఒకరు, కొడకంచికి చెందిన ఇద్దరితో పాటు క్వారీ యజమాని మాత్రమే తమ అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో ఉదయం11.11 గంటలకు అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగిసిందని ప్రకటించి వెళ్లిపోయారు. తమ అభిప్రాయాన్ని తెలుపటానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని, అందుకే సకాలంలో వెళ్లలేకపోయామని రాళ్లకత్వ గ్రామస్థులు ఆందోళన చేశారు. ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ గ్రామంలో క్వారీలకు అనుమతిని ఇచ్చేది లేదని నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయం అడవుల్లో పెట్టి తాము వచ్చేవరకు ఆగకుండా వారికి అనుకూలంగా మార్చుకొని వెళ్లిపోయారని వాపోయారు. భవిష్యత్తులో క్వారీకి అనుమతిని ఇస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.

ఈ ఆందోళనకు జెడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, సర్పంచి రమమల్లేశ్ మద్దతు తెలిపారు. అప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియటంతో పోలీసులు ఆందోళనకారులను పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా… తమ గ్రామ శివారులో ఏర్పాటు చేసే క్వారీపై రాళ్లకత్వలో ప్రజాభిప్రాయం ఏర్పాటు చేస్తే ఎలా అని ఊట్ల గ్రామస్థులు వాపోయారు. 829/1 సర్వే నెంబర్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా లేకుంటే చర్యలు తప్పవని జిల్లా అధికారులు బెదిరించారని సర్పంచి ఆంజనేయులు వాపోయారు. క్వారీని ఎలా ఏర్పాటు చేస్తారో చూస్తామని మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గంగు రమేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు శివ రాజ్, గోవిందరాజు, నాయకులు జహంగీర్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పటాన్ చెరువు డీఎస్సీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు.