అనుమతి లేని క్రషర్స్ పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా!

  • జంట జలాశయాలకు సమీపంలోనే పలు క్రషర్స్
  • ఇప్పటికే భారీగా పర్యావరణ విధ్వంసం.. ఇటీవల వరుస తనిఖీలు
  • పలు క్రషర్స్ సంస్థలకు రూ.5.5 కోట్ల జరిమానా

మహానగరం అయిన హైదరాబాద్ పరిధిలో గాలి, నీరు, నేల కాలుష్యానికి పాల్పడుతోన్న పలు క్రష ర్స్ సంస్థలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. చారిత్రక జంట జలాశయాలకు సమీపంలో భారీ క్రషర్స్ ను నిబంధనలకు  విరుద్ధంగా ఏర్పాటు చేసి రేయింబవళ్లు యంత్రాలను నడిపిస్తూ.. భారీగా పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోన్న అక్రమార్కులకు తాజాగా రూ.5.5 కోట్ల మేర జరిమానా విధించింది. కాగా జలాశయాలకు సమీపంలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలుల నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్స్ పై ఓ పర్యావరణ సంస్థ చైన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన వ్యాజ్యం విషయంలో ధర్మాసనం తీవ్రంగా స్పందించడంతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికార బృందాలు రంగంలోకి దిగి ఇటీవల విస్తృత తనిఖీలు చేపట్టాయి. తాజాగా అక్రమార్కులకు భారీగా జరిమానా విధించడం చెప్పుకోదగ్గ విషయం.

మరీ ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోనే కోకొల్లలు..

• సుమారు శతాబ్దకాలంగా స్వచ్ఛమైన తాగునీటితో హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తోన్న జంట జలాశయాలకు దాని చుట్టూ ప్రక్కల ఉన్న గుట్టలను, కొండలను పిండిచేస్తున్న క్రషర్స్ శాపంలా పరిణమించాయి.

• ప్రధానంగా వట్టినాగులపల్లి, కోకాపేట్, గౌలిదొడ్డి, గోపన్ పల్లి, కొల్లూరు, కొత్వాల్ గూడ, ఉస్మాన్ నగర్, రంగారెడ్డి జిల్లా చుట్టూపక్కల ఉన్న తదితర గ్రామాల్లో పుట్టగొడుగుల్లా క్రషర్స్ వెలిశాయి. వీటిలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేనివే అత్యధికంగా ఉండడం గమనార్హం. అనుమతులు లేని క్రషర్స్ వెనుక కొందరు పిసిబి అధికారుల అవినీతి ఉందని పలువురు పర్యావరణ వేత్తలు, స్థానిక రైతులు చెబుతున్నారు.  

* కొందరు నామమాత్రంగా అనుమతులు తీసుకున్నప్పటికీ పర్యావరణ నిబంధనలను తుంగలోకి తొక్కి క్రషర్స్ నడుపుతుండడంతో భారీగా సూక్ష్మ, స్థూల ధూళికణాలు గాలిలో కలిసి అక్కడి నుంచి స్వచ్ఛమైన తాగునీరు కలిగిన జంట జలాశయాల్లోకి చేరుతుండడంతో జలాలు కలుషితమౌతున్నాయి.

* కాగా భారీగా పర్యావరణ కాలుష్యానికి కారణమౌతున్న క్రషర్స్ కు జాతీయ హరిత ట్రిబ్యునల్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

*అంతేకాక భారీగా పర్యావరణ కాలుష్యానికి కారణమౌతున్నక్రషర్స్ కు పర్యావరణ పరిహారం (ఎన్విరాన్ మెంటల్ కాంపెన్ సేషన్) విధిస్తామని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన క్రషర్స్ ను మూసివేత (క్లోజర్) ఆదేశాలు అందిన వెంటనే తక్షణం తొలగించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

* కాగా పర్యావరణ పరిహారం కింద ఆయా క్రషర్స్ సంస్థలకు వారి ఉల్లంఘనలను బట్టి రూ.8.45 లక్షల నుంచి రూ.91 లక్షల వరకు పర్యావరణ పరిహారం చెల్లించాలని ఆయా సంస్థలకు వేర్వేరుగా జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేయడం గమనార్హం.

పర్యావరణ విధ్వంసం

సుమారు మూడు టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన జంట జలాశయాలను పరిరక్షిస్తూ గతంలో అమలు చేసిన జీఓ 111ను రద్దు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే అక్రమార్కులు చెలరేగి పోతున్నారు. జలాశయాలకు పది కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రషర్స్, ఆయిల్ మిల్స్, ప్లాస్టిక్, రీసైక్లింగ్, ఫార్మా, బల్క్ డ్రగ్ తదితర రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలతో సమీపంలో గాలి, నీరు, నేల, భూగర్భజలాల కాలుష్యం, పర్యావరణ విధ్వంసం జరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జలాశయాలకు ఆనుకొని రియల్ఎస్టేట్, నిర్మాణరంగ కార్యకలాపాలు ఊపందుకోవడంతో పరిస్థితి విషమిస్తోందని చెబుతున్నారు. తిరిగి 111 జీఓను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పర్యావరణ కాలుష్యానికి కారణమౌతున్న పరిశ్రమలు, క్రషర్స్ మొదలగు వాటిపై కఠిన చర్యలు తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలని పలువురు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.