మైనింగ్‌ జోన్‌ వద్దే వద్దు

యాచారం మండల కేంద్రంలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి(కాంగ్రెస్‌), ఎంపీపీ కొప్పు సుకన్యబాషా (బీజేపీ), జడ్పీటీసీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ(టీఆర్‌ఎస్‌), సీపీఎం నేతలతోపాటు.. రైతులు నిరసన వ్యక్తం చేశారు. మైనింగ్‌జోన్‌ ఏర్పాటుపై శనివారం రాష్ట్ర పొల్యూషన్‌ బోర్డు అధికారులు యాచారంలోని గుట్టల ప్రదేశంలో ప్రజాభిప్రాయసేకరణ సభను ఏర్పాటు చేశారు. అంతకుముందు మైనింగ్‌జోన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ టెంట్‌ తొలగించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవితోపాటు నాయకులు రాజు, శ్రీనివా్‌సరెడ్డి, నాగరాజులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పొల్యూషన్‌ బోర్డు అధికారి వెంకటనర్సింహ, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావులు మాట్లాడుతూ.. మైనింగ్‌ జోన్‌ ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనింగ్‌ జోన్‌ వద్దంటూ తామంతా ఆందోళన చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ఆందోళనకారులు అదనపు కలెక్టర్‌తో వాదనకు దిగారు. పేలుళ్ల కారణంగా సమీపంలోని ఇళ్లు కూలడంతో పాటు వ్యవసాయ బోర్లు పాడవుతాయని, దీంతో సాగుకు ఇబ్బందులు ఏర్పడుతాయని అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు వేదిక మీదకు దూసుకొచ్చేందుకు యత్నించడంతో పాటు.. కుర్చీలు విసిరి బయటకు పడేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు అధికారులు సభను ముగించి వెళ్లిపోయారు.