వనస్థలి హరిణి పార్కుకు కాలుష్య బెడద

  • ఆటోనగర్‌ నుంచి పార్కులోకి చేరుతున్న వ్యర్థ జలాలు
  • చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ల వినతి

వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్‌ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా జింకల పార్కులోని కుంటల్లోకి చేరుతుండటంతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారింది. పార్కు మీదుగా వెళ్లే డ్రైనేజీని మళ్లించి వన్యప్రాణులను సంరక్షించాలని ఫారెస్టు అధికారులు, స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ఫారెస్టు అధికారులు స్థానిక పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, హెచ్‌ఎండీఏ వర్గాల దృష్టికి తీసుకెళ్లారు. 15 ఎకరాల్లో విస్తరించిన వనస్థలి హరిణి పార్కులో పదుల సంఖ్యలో వాటర్‌ బాడీస్‌ ఉన్నాయి. ఆ పక్కనే ఉండే ఆటోనగర్‌ డ్రైనేజీ నీరుతో భారీ రసాయన మిశ్రమాలు పార్కులోకి చేరడంతో పరిసరాలు కాలుష్య కాసారంగా మారుతున్నాయని అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన చెందుతున్నారు.

కేటీఆర్‌ దృష్టికి విషయం..

పర్యావరణానికి మేలు చేసే పార్కుతోపాటు మూగజీవాలను పరిరక్షించాలని స్థానికులు, జంతు ప్రేమికులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అయితే విషయం మంత్రి వద్దకు చేరడంతో.. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు 20 రోజుల క్రితమే ఫిర్యాదు చేశామని స్థానిక ఫారెస్టు అధికారులు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ స్పందించి వన్యప్రాణులను పరిరక్షించాలని స్థానికులు, నెటిజన్లు కోరుతున్నారు. (సోర్స్: నమస్తే తెలంగాణ)