- తొలగించని క్రోమైట్ పరిశ్రమ
- పేరుకుపోయిన లక్ష టన్నుల వ్యర్థాలు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు, పర్యావరణవేత్తలు
దామరచర్ల మండల కేంద్రం శివారులో సుమారు పది ఎకరాల స్థలంలో 1998 ఆగస్టులో డక్కన క్రోమైట్స్ లిమిటెడ్ పేరుతో కెమికల్ పరిశ్రమను యాజమాన్యం స్థాపించింది. సల్ఫ్యూరిక్ యాసిడ్, క్రోమోర్, సున్నపురాయితో పాటు మరికొన్ని కెమికల్స్ ముడి పదార్థాలతో సోడియం బై క్రోమైట్, బేసిక్ క్రోమియం సల్ఫేట్, సోడియం ఎల్లో సల్ఫేట్, సోడియం వైట్‌సల్ఫేట్ వంటి ప్రమాదకర ఉత్పత్తులను తయారు చేసి వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలకు, తోళ్లు శుద్ధి, పేపర్, మెడిసిన, రంగుల తయారీలో ముడి సరుకులుగా విక్రయించింది.
వ్యర్థాల శుద్ధి మరిచిన యాజమాన్యం
పరిశ్రమ ప్రారంభం నుంచి మూతబడే వరకు వ్యర్థాలను యాజమాన్యం సమీపంలోనే నిల్వ చేసింది. పరిశ్రమ నుంచి ప్రతి రోజూ సుమారు 40 టన్నులకు మేర వ్యర్థాలు వెలువడ్డాయి. వాటిని నిత్యం లారీల ద్వారా హైదరాబాద్‌లోని దుండిగల్‌కు తరలించి వ్యర్థాల శుద్ధి పరిశ్రమ యాజమాన్యానికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వాటి తరలింపునకు భారీగా నగదు ఖర్చు చేయాల్సి వస్తుందని భావించిన యాజమాన్యం పరిశ్రమ సమీపంలో సుమారు 10 ఎకరాల స్థలంలో 10 అడుగుల మేర గుంతను తవ్వి ప్రహరీ నిర్మించి అందులో వ్యర్థాలను నిల్వచేసింది. పరిశ్రమ వ్యర్థాల నుంచి వెలువడిన ప్రాణాంతక రసాయనం సమీపంలోని కృష్ణానదిలోకి చేరడంతో పాటు వ్యవసాయ పొలాల్లో నీరు కలుషితమై రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. పొలాల్లో నీరు రంగు మారి చర్మ సమస్యలు వస్తుండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రజలు, పర్యావరణవేత్తలు ఆందోళనతో 2008లో అధికారులు పరిశమ్ర అనుమతులు రద్దు చేశారు. దీంతో పరిశ్రమ మూతపడింది. దశలవారీగా పరిశ్రమలోని యంత్రాలను తరలించిన యాజమాన్యం వ్యర్థాలను మాత్రం ఇక్కడే వదిలేసింది. పరిశ్రమ మూతపడి 14 ఏళ్లు గడిచినా నేటికి వ్యర్థాల కుప్ప నుంచి విషతుల్య రసాయనం విడుదలై సమీప పొలాలతో పాటు కృష్ణానదిలో కలుస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
వ్యర్థాలతో క్యాన్సర్ ముప్పు
పరిశ్రమ వ్యర్థాలతో క్యాన్సర్ కారక మయ్యే క్రోమ్-6 అధిక రెట్లు ఉత్పత్తి అవుతుందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. భవిష్యతలో ఈ ప్రాంతంలో ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన ్యక్తం చేస్తున్నారు.
రాయిని సైతం పిండి చేస్తున్న రసాయనం
పది ఎకరాల స్థలంలో సుమారు 40 అడుగుల ఎత్తు వరకు పేరుకుపోయిన విషతుల్య వ్యర్థాల గుట్ట నుంచి ప్రాణాంతక రసాయనం నేటికీ ప్రవహిస్తోంది. ఆ ప్రవాహ సమీపంలోని రాళ్లు సైతం సహజత్వాన్ని కోల్పోయి పొరలుపొరలుగా పలుచబారిపోతున్నాయి. ఇలాంటి ప్రాణాంతక వ్యర్థాలను తొలగించకపోతే మరో ఉద్యమం తప్పదని ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తక్షణమే వ్యర్థాలను తొలగించాలి
పరిశ్రమ వదిలేసిన విషతుల్య వ్యర్థాలతో ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. పోరాటాల ఫలితంగా పరిశ్రమను మూసివేసినా వ్యర్థాలను తొలగించకపోవడంతో నిత్యం వేల లీటర్ల ప్రాణాంతక రసాయనం కృష్ణానదిలో కలుస్తోంది. ఫలితంగా నది నీరు కలుషితమై ప్రజల ప్రాణాలకు హాని కలుగుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యర్థాలను తొలగించాలి.
వేనేపల్లి పాండురంగారావు (తెలంగాణ మట్టిమనుషుల ఫోరం కన్వీనర్)
(సోర్స్: ఆంధ్రజ్యోతి)