• నాలాల్లోకి వదులుతున్న రసాయన వ్యర్థాలు
• అడ్డుకుంటున్న అధికారులపై దాడులు
• ఇష్టారాజ్యంగా డంపింగ్
• అనారోగ్యం పాలవుతున్న జనం
• పట్టించుకోని ఉన్నతాధికారులు
కెమికల్ గోదాంల నిర్వహణ లోపాలు స్థానికుల పాలిట శాపంగా మారాయి. నిర్వాహ కుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి అక్రమంగా వ్యర్థాల పారబోత వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఎప్పుడు ఏ విధమైన ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయో? ప్రమాణాలు పాటించని కెమికల్ గోదాంలలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒక అడుగు ముందుకేసి అధికారులు చర్యలు తీసుకుందామంటే వారిపై ఏకంగా దాడులు చేస్తున్నారు. మరో రకంగా గోదాంలపై చర్యలకు అధికారులు ఒక అడుగు ముందుకు వేస్తే నాయకుల సిఫార్సులతో పది అడుగులు వెనక్కి లాగేస్తున్నారు. ఒకప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఇప్పుడు దాదాపుగా జనావాసాల మధ్యకు వచ్చేసింది. దీంతో కెమికల్ గోదాంల పక్కనే జనావాసాలు ఉండటంతో ఇప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక అక్కడి వారిని కెమికల్ భూతం వెంటాడుతూనే ఉంది.
ఇష్టానుసారంగా వ్యర్థాల పారబోత…
జీడిమెట్ల పారిశ్రామికవాడ 896 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది. ఇక్కడ వందల సంఖ్యలో ఫార్మా, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలను దూలపల్లి రోడ్డులో ఉన్న జీఈటీఎల్ (జీడిమెట్ల ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్)కు తరలించాల్సి ఉంటుంది. ఒక జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచే కాకుండా సమీప ప్రాంతాల నుంచి కూడా రసాయన వ్యర్థాలు ఇక్కడకు తరలిస్తుంటారు. అయితే కొందరు ఖర్చును తగ్గించుకునేందుకు పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా నాలాల్లోకి విడిచి పెట్టేస్తూ ఉంటారు. ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో రసాయన వ్యర్థాలను నాలాల్లోకి, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తూ దొరికిపోయిన సంఘటనలు అనేకం.
కనీస నిర్వహణ లేని కెమికల్ గోదాంలు…
జీడిమెట్ల పారిశ్రామిక వాడతో పాటు సుభాశ్ నగర్ పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా కెమికల్ గోదాంలు ఉన్నాయి. చాలా వరకు అనుమతులు లేకుండా నిర్వహించడమే కాకుండా కనీస నిర్వహణ చర్యలు కూడా చేపట్టకుండా నిర్వహిస్తున్నారు. దీంతో రసాయనాలు విడుదలై ఘాటు వాసనలు వెలువడటంతో పాటుగా, అనేక సందర్భాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కెమికల్ గోదాంలు ఇళ్ల మధ్యనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. గోదాంలను తరలించాలంటూ వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవడం తప్ప చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.
చోటు చేసుకున్న ప్రమాదాలు..
• ఈ నెల (డిసెంబర్) 2వ తేదీ తెల్లవారుజామున ఓ కెమికల్ ట్యాంకర్ (ఏపీ 28 టీడీ 7997). జీడిమెట్ల బస్ డిపో సమీపంలో నాలాలోకి రసాయన వ్యర్ధాలను వదిలి పెడుతుండగా కాలుష్య నియంత్రణ మండలి ప్రాజెక్ట్ ఎనలిస్ట్ రాకేశ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ కిరణ్ కుమారులు వాహనాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తరలిస్తుండగా కొందరు ముకుమ్మడిగా అధికారులపై దాడి చేసి వాహనాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
• ఈ నెల (డిసెంబర్) 5వ తేదీ జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేస్ వన్ లో ఉన్న గంజి కెమికల్ ట్రేడింగ్ కంపెనీలో టాంకర్లలో నిర్వహించిన రసాయనాలు లీకై భారీగా రోడ్లపై ఏరులై పారింది. ఈ రసాయనాలు దిగు ప్రాంతమైన వినాయకనగర్ ప్రధాన గల్లీలో పారడంతో ఘాటాయిన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో స్థానికుల తరఫున నదీమ్ అనే వ్యక్తి కెమికల్ కంపెనీ నిర్వాహకులైన వెంకట్, వినయ్ పై జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
• ఆగస్టు 4న భారీ వర్షం కురియడంతో జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఫేస్ వన్ లో ఉన్న పోప్ కెమికల్స్ కంపెనీ వారు వర్షం నీటితో పాటుగా రోడ్లపైకి రసాయన వ్యర్థాలు విడిచిపెట్టారు. అనే ఫిర్యాదుతో పీసీబీ అధికారులు. నోటీసులు జారీ చేశారు.
• జనవరి 13న దుండిగల్ తండా సమీపంలో బహిరంగ ప్రదేశంలో రసాయన వ్యర్థాలను పారబోయడంతో అక్కడ గడ్డి మేసిన ఓ గేదె. మృతి చెందింది.
• 2018 జూలై నెలలో దుండిగల్ పరిసరాల్లో మిషన్ భగీరథ కోసం తీసిన గుంతలో 10 టాంకర్ల వరకు భారీగా రసాయన వ్యర్థాలను అందులో పారబోయటం కలకలం సృష్టించింది.
• 2016లో జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఓ కాళీ ప్రదేశంలో భారీ ఎత్తున రసాయన వ్యర్థాలను భూగర్భంలోకి నిక్షిప్తంచేస్తున్న ప్రదేశాన్ని పీసీబీ అధికారులు కనుగొన్నారు. అక్కడ జరుగుతున్న భారీ అక్రమ డంపింగ్ ను చూసి నీవ్వెరపోయారు.
• గాజులరామారం సర్వే నెంబర్ 19లో 471 ఎకరాల్లో విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఇప్పటికీ అడపాదడపా రసాయన వ్యర్థాలను డంప్ చేస్తూనే ఉన్నారు. (సోర్స్: దిశ)