మైనింగ్‌ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి హాని కలిగించొద్దు

మైనింగ్‌ ఏర్పాటు ద్వారా ప్రజా జీవనానికి, రైతులకు, పర్యావరణానికి హాని కలగకుండా చూడాలని మండల పరిధిలోని సాలార్‌పూర్‌, రేకులకుంట తండా, చల్లంపల్లి తదితర గ్రామాల ప్రజలు కోరారు. కడ్తాల్‌ మండలం సాలార్‌పూర్‌ గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయతలపెట్టిన మైనింగ్‌ పర్యావరణ అనుమతుల కోసం మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేనెంబర్‌ 97లో రఫ్‌స్టోన్‌, రోడ్డు మెటల్‌ క్వారీ మైనింగ్‌ ఏర్పాటుకు మెస్సెర్స్‌ వజ్రం ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకులు 10.266 హెక్టార్ల విస్తీర్ణం భూమి లీజు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మైనింగ్‌ ఏర్పాటుకు తలపెట్టిన ప్రాంతంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. కందుకూరు ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎం.వెంకటనర్సింహ, తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో మధుసూదనాచారి పాల్గొన్నారు. మైనింగ్‌ ఏర్పాటుకు తలపెట్టిన సమీప ప్రాంతాలైన సాలార్‌పూర్‌, రేకులకుంట తండా, చల్లంపల్లి తదితర గ్రామాల ప్రజలు, నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదేవిధంగా సమీపంలో కొనసాగుతున్న మరో క్రషర్‌ మిషన్‌ వల్ల కలుగుతున్న ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వక్ఫ్‌ భూముల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవోను పలువురు రైతులు కోరారు. ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తపరిచిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆర్డీవో తెలిపారు. మెస్సెర్స్‌ వజ్రం ఎంటర్‌ ప్రైజేస్‌ నిర్వాహకుడు రజనీకాంత్‌ మాట్లాడుతూ రైతుల పంటలకు నష్టం కాకుండా, పర్యావరణానికి హాని కలగకుండా చూడడంతోపాటు గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ విజయలక్ష్మి, ఉప సర్పంచ్‌ శ్రీశైలం, రాజేందర్‌, ప్రకాశ్‌ నాయక్‌, పంతూనాయక్‌, శంకర్‌, వెంకట్‌రెడ్డి, రవికుమార్‌, రమేశ్‌, ఆనంద్‌ కుమార్‌, శ్రీను, మల్లేశ్‌, సుదర్శన్‌, బీచ్య తదితరులు పాల్గొన్నారు.