కాటేస్తున్న డక్కన్ క్రోమైట్స్ కాలుష్యం

* క్రోమైట్స్ వ్యర్ధలతో జీవనదులు కలుషితం

ప్రమాదకరమైన క్రోమైట్స్ వ్యర్థాలతో దామరచర్లలో భూగర్భజలాలు, జీవనదులు కలుషితం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషపూరిత రసాయనాలను అక్కడి నుంచి తరలించాలని గతంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సదరు పరిశ్రమ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసి ఏళ్ళు గడుస్తున్నా.. పట్టించుకునే వారే లేరు. సమీపంలో ఉన్న మూసీ, కృష్ణా నదులలో ఈ రసాయనాలు కలుస్తుండటంతో జలాలు రంగు మారి విషపూరితంగా ఉంటున్నాయి. గుట్టలుగా పడి ఉన్న వ్యర్థ నిల్వలకు పక్కన పంటపొలాలు ఉండగా భూగర్భజలాలు విషతుల్యమైనట్లు రైతులు తెలిపారు. సుమారు 70 వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధ నిల్వలు ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. దామరచర్లకు కిలోమీటర్ దూరంలో డక్కన్ క్రోమైట్స్ లిమిటెడ్ సోడియం డైక్రోమైట్ దాని ఉపఉత్పత్తుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు.

ఈ రసాయనాలను తోళ్లశుద్ధితో పాటు వివిధ ఉత్పత్తులలో వినియోస్తుంటారు. కాలుష్యం అధికంగా ఉండటంతో స్థానికుల అభ్యంతరం మేరకు చాలా ఏళ్ల కిందటే మూసివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సోడియం డ్రైక్రోమైట్ తయారీ నుంచి వెలువడిన వ్యర్థాలను సదరు పరిశ్రమ వారు అక్కడే గుట్టలుగా పోసి వదిలేశారు. వాస్తవానికి వ్యర్థాలను హైదరాబాద్ లోని దుండిగల్ వేస్ట్ మేనేజ్ మెంట్ కు తరలించాల్సి ఉంది. పరిశ్రమ మూతపడగానే యాజమాన్యం వ్యర్థాల తరలింపును పట్టించుకోకపోవడంతో అవి విషపూరితంగా మారాయి. వ్యర్ధ రసాయనాల నిల్వల పక్కనే బుగ్గవాగు ఉండగా వాటిలో కలవడంతో జలాలు రంగు మారి అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసీనదిలో ప్రవహిస్తూ… ఈ నీరు కృష్ణా – మూసీ సంగమం వద్దకు చేరుకుంటున్నాయి. ఈ నీటితో మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయి. సమీపంలో ఉన్న బోర్లు, భూగర్భజలాలు కలుషితం కాగా ఆ నీటి ద్వారా పంటలు పండిస్తున్నారు.